బొద్దు..వద్దమ్మా..! మహిళల్లో పెరుగుతున్న ఊబకాయం

10 Oct, 2022 07:56 IST|Sakshi

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 29 శాతం మందికి సమస్య  

స్థూలకాయంతో దీర్ఘకాలిక వ్యాధులు  

వేధిస్తున్న సంతానలేమి

గుండెజబ్బులు వచ్చే అవకాశం

అందానికి, ఆకృతికి మహిళలు అధిక ప్రాధాన్యత ఇస్తారు. అయితే జీవన శైలిలో వచ్చిన మార్పులతో మగువలు బొద్దుగా మారుతున్నారు. స్థూలకాయంతో ఇబ్బంది పడుతున్నారు. పలు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 29 శాతం మంది మహిళలు అధిక బరువుతో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.   

కర్నూలు(హాస్పిటల్‌): ఇంటి పనితోపాటు పిల్లల బాధ్యత చూస్తూ మహిళలు ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తున్నారు. వంట చేసే సమయం లేక కొందరు బయట నుంచి ఆహారాన్ని తెచ్చుకుని ఆరగిస్తున్నారు. కూర్చుని ఎక్కువసేపు పనిచేయడం, వ్యాయామం లేకపోవడం, మానసిక ఒత్తిడి కారణంగా మహిళల్లో ఊబకాయ సమస్య పెరిగిపోతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రస్తుత అంచనాల ప్రకారం 48 లక్షల జనాభా ఉంది. అందులో మహిళలు 23 లక్షలకు పైగా ఉన్నారు. వీరిలో 15 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు వారు 16 లక్షల వరకు ఉన్నారు. మొత్తం మహిళా జనాభాలో 29 శాతం అంటే 6.67లక్షల దాకా స్థూలకాయంతో బాధపడుతున్నారు. ఇందులో 15 నుంచి 50 ఏళ్లలోపు వారే అధికంగా ఉన్నట్లు ఐదో జాతీయ కుటుంబ సర్వేలో వెల్లడవుతోంది.

పట్టణాల్లోనే అధికం..
గ్రామీణ ప్రాంతాల కన్నా పట్టణాల్లోని మహిళలు ఊబకాయంతో బాధపడుతున్నట్లు జాతీయ కుటుంబ సర్వే వెల్లడించింది. పట్టణ మహిళల్లో 44.4 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 32.6 శాతం స్థూలకాయులు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో శారీరక శ్రమ చేసే వారు అధికం. దీంతో పల్లెల్లో ఊబకాయుల సంఖ్య తక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతాలకు విరుద్దంగా పట్టణాల్లో పరిస్థితి ఉండడంతో లావైపోతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఎక్కువ మంది ఇంటి పనిలో యంత్రాలపై ఆధారపడుతున్నారు. ఒక వైపు కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దడం, మరోవైపు ఉద్యోగ బాధ్యతలతో కొందరు  కొన్నిసార్లు ఒకపూట ఆహారం తీసుకోకపోవడం, తర్వాత తీసుకున్నా ఒకేసారి ఎక్కువ తినడం చేస్తున్నారు. ఫలితంగా వారిలో స్థూలకాయ సమస్య తలెత్తుతోంది. గృహిణిలైతే ఇంట్లో ఒక్కరే ఉండటం, అత్తా, తోడి కోడళ్లు ఉంటే వారితో పొసగకపోవడం వంటి కారణాలతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఈ కారణంగా ఊబకాయం పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

జంక్‌ఫుడ్‌తో అసలు సమస్య 
కార్పొరేట్‌ కంపెనీలు నగరాల నుంచి పట్టణాలకు విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలో పిజ్జాలు, బర్గర్లు, ప్యాకేజ్డ్‌ ఫుడ్, ఐస్‌క్రీమ్‌లు, వేపుళ్లు తెచ్చుకుని తినడం ఫ్యాషన్‌గా మారింది. మనసు కోరుకుంటే చాలు వెంటనే చేతిలోని మొబైల్‌లోనే జొమాటో, స్విగ్గీల ద్వారా జంక్‌ఫుడ్‌ను ఆర్డర్‌ పెట్టేసి మరీ తెప్పించుకుని తింటున్నారు. దీనికితోడు రెస్టారెంట్లలో విక్రయించి ఆహారాల్లో బిర్యానీదే మొదటి స్థానం. ఇందులో అధిక శాతం క్యాలరీలు ఉండటం, వీటికితోడు కూల్‌డ్రింక్‌లు తాగడం వల్ల తక్కువ సమయంలోనే మహిళల్లో ఊబకాయం వచ్చేస్తోంది.

క్యాన్సర్‌ వచ్చే అవకాశం  
సమాజంలో ప్రతి నలుగురిలో ఒకరు ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. గ్రామాలతో పోలిస్తే పట్టణాల్లో ఈ సమస్య అధికంగా ఉంది. బరువు పెరిగితే గర్భాశయంలో నీటి బుడగలు వచ్చి సంతానలేమి సమస్య ఎదురవుతుంది. వీరికి భవిష్యత్‌లో టైప్‌–2 డయాబెటీస్‌ కూడా వస్తుంది. సంతానలేమి సమస్యకు హార్మోన్‌ మాత్రలు ఇవ్వడం వల్ల మరింత ఊబకాయం వస్తుంది. అధిక బరువు వల్ల బీపీ, షుగర్, గుండెజబ్బులు సైతం వచ్చే అవకాశం ఉంది. కొన్నిసార్లు బ్రెస్ట్, గర్భాశయ క్యాన్సర్లకు కూడా ఊబకాయం దారి తీస్తుంది.  
–డాక్టర్‌ కె. కావ్య, గైనకాలజిస్టు, కర్నూలు 

సమతుల ఆహారాన్ని తీసుకోవాలి
తినే ఆహారానికి సరిపడా వ్యాయామం చేయకపోవడం వల్లే ఊబకాయం వస్తోంది. ఈ సమస్య నివారణకు సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. వేపుళ్లు, తీపి పదార్థాలు తగ్గించాలి. ఐస్‌క్రీమ్‌లు, జంక్‌ఫుడ్, ఫాస్ట్‌ఫుడ్‌ మానేయాలి. ఇంట్లో వండిన ఆహారాన్నే తినేందుకు సుముఖత చూపాలి. ఆహారంలో అధికంగా కూరగాయలు, పండ్లు, నట్స్‌ ఉండేలా చూసుకోవాలి. కొవ్వు పదార్థాలు, కార్పొహైడ్రేట్లు తగ్గించుకోవాలి. వేళకు భోజనం చేయడం, నియమిత వ్యాయామం చేయడం, ప్రశాంతంగా ఉండడం వల్ల ఊబకాయాన్ని నియంత్రించుకోవచ్చు.  
–డాక్టర్‌ జి. రమాదేవి, పోషకాహార నిపుణురాలు, కర్నూలు 

వ్యాయామం తప్పనిసరి
ఎంతైనా తిను...తిన్న దానిని అరిగించు అనేది నేటి తరం వైద్యుల మాట. కానీ తిన్న తర్వాత కూర్చోవడమే పనిగా చాలా మంది మహిళలు ఉంటున్నారు. తినడం ఆ తర్వాత మొబైల్, టీవీలు చూస్తూ కూర్చోవడం వల్ల ఊబకాయం పెరిగిపోతోంది. ఉదయం లేవగానే ఓ గంటపాటు వ్యాయామం చేసే ఓపిక చాలా మందిలో ఉండటం లేదు. కేవలం ఒకటి నుంచి నాలుగు శాతం మంది మహిళలు మాత్రమే యోగాశ్రమాలు, జిమ్‌లు, వాకింగ్‌కు వెళ్లి శారీరక శ్రమ చేస్తున్నారు. ఉన్నత పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల విద్యార్థినులకు ఆటలే ఉండటం లేదు. వీరే అధికంగా ఆహారాన్ని తింటూ ఎక్కువ సేపు తరగతుల్లో గడుపుతున్నారు. వీరిలోనూ సమస్య అధికమవుతోంది.

ఇదీ చదవండి: Health Tips: అధిక రక్తపోటు ప్రాణాలకు కూడా ముప్పే! వీటిని తరచుగా తిన్నారంటే..

మరిన్ని వార్తలు