టీడీపీ నాయకుల బండారం బట్టబయలు.. కోట్ల విలువైన 8 ఎకరాల భూమిని..

19 Aug, 2022 17:16 IST|Sakshi
పెంటిపద్ర గిరిజన గ్రామంలో టీడీపీ నాయకులు ఆక్రమించిన కోట్ల విలువైన స్థల పరిశీలనలో ఆర్డీఓ సీతారామమూర్తి, తహసీల్దార్‌ మధుసూదన్‌

పలాస–కాశీబుగ్గలో ప్రభుత్వ భూముల ఆక్రమణ 

8 ఎకరాల మేర ఆక్రమించిన టీడీపీ నాయకులు 

అధికారుల పరిశీలనలో వెల్లడైన వాస్తవాలు 

కాశీబుగ్గ (శ్రీకాకుళం): అధికారుల సాక్షిగా టీడీపీ నాయకుల బండారం బయటపడింది. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో అధికారులు గురువారం చేపట్టిన ప్రత్యేక పరిశీలనలో పచ్చనేతలే ఆక్రమణదారులని తేలింది. టీడీపీ నాయకులు పెంట ఉదయ్‌శంకర్, లొడగల కామేష్‌ దాదాపు 8 ఎకరాలకుపైగా భూమిని ఆక్రమించినట్లు స్పష్టమైంది. పలాస ఆర్డీఓ సీతారామమూర్తి, తహశీల్దార్‌ మధుసూదనరావు, సర్వేయర్లు ఇతర రెవెన్యూ సిబ్బంది గురువారం పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పద్మనాభపురం, పెంటిబద్ర, సూదికొండ, నెమలికొండ, ఉదయపురం ప్రాంతాల్లో పర్యటించారు. 

పెంటిబద్ర గిరిజన గ్రామంలో రికార్డులు, భూమిని పరిశీలించగా సర్వే నంబర్‌ 311/ఎ మంగబంద (చెరువు)లో 04.85 ఎకరాలు భూమి, సర్వే నంబర్‌ 314/08 గజాలు గుమ్మి, 00.96 ఎకరాలు భూమి, పద్మనాభపురం రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్‌ 365/05లో 02.31 ఎకరాల కాలువ భూమి ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు. వీటి విలువ కోట్లలో ఉంటుందని అధికారులు చెబుతున్నారు.   

స్వాధీనం చేసుకుంటాం.. 
ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు తప్పవని, త్వరలోనే భూములను స్వాధీ నం చేసుకుంటామని పలాస ఆర్డీఓ సీతారామమూర్తి స్పష్టం చేశారు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో జరుగుతున్న ఆక్రమణలపై హైకోర్టులో పిల్‌ వేసిన సందర్భంగా ప్రభుత్వం ఎప్పటికప్పుడు నివేదిక అందించాలని తమను ఆదేశించిందన్నారు. స్థానికంగా ఎలాంటి ఆక్రమణలు జరగడానికి అవకాశం లేకుండా చర్యలు చేపడతామని తెలిపారు. జగనన్న భూరక్షణ పథకంలో భాగంగా ప్రభుత్వ భూముల స్వాధీనం నిరంతర ప్రక్రియగా సాగుతుందన్నారు. 

మున్సిపాలిటీలోని 27 గ్రామాల్లో ఆక్రమణలను గుర్తించామని, వాటిని తొలగిస్తామని చెప్పారు. ఎక్కడెక్కడ భూములు ఆక్రమించారు, దాని వెనుక ఎవరున్నారో నిగ్గు తేల్చి ప్రభుత్వ భూమిని కాపాడుకుంటామని తెలిపారు. ఆయనతో పాటు పలాస తహసీల్దార్‌ లంబాల మధుసూదన్, సర్వేయర్‌ గిరికుమార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్, వీఆర్‌ఓ ఖగేశ్వరరావు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.   


తహసీల్దార్‌తో వాగ్వాదం చేస్తున్న టీడీపీ మద్దతుదారులు

ఉద్రిక్తత..  
పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఉదయపురం చెరువు వద్ద ఆక్రమణలు గుర్తించి వాటిని తొలగించేందుకు అధికారులు గురువారం సాయంత్రం సిద్ధమయ్యారు. అధికారుల రాకతో ఉదయపురం సమీపంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌గా పనిచేసిన గురిటి సూర్యనారాయణకు చెందిన కొన్ని నిర్మాణాలు చెరువులో ఉన్నాయని ఆర్డీఓ గుర్తించగా వాటిని తొలగించేందుకు జేసీబీతో సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. వెంటనే గురిటి సూర్యనారాయణ బంధువులు, మద్దతుదారులు వందల సంఖ్యలో చేరుకుని అడ్డుకున్నారు. తహసీల్దార్‌ను చుట్టుముట్టి వాగ్వాదానికి దిగారు. కాశీబుగ్గ పోలీసులు రంగంలోకి దిగడంతో ఉద్రిక్తత  సద్దుమణిగింది.

మరిన్ని వార్తలు