విద్యార్థుల ప్రయాణం సురక్షితం.. సుఖవంతం

3 Aug, 2022 17:01 IST|Sakshi
విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆర్టీసీ బస్సు

పార్వతీపురం మన్యం జిల్లాలో ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు

వివిధ రూట్లలో విద్యార్థుల సమయానికి అనుగుణంగా బస్సులు

12 ఏళ్లలోపు విద్యార్థులకు ఉచిత బస్‌పాసులు

12–18 ఏళ్ల మధ్యవారికి 60 శాతం రాయితీపై పాసుల జారీ

పాఠశాలలు.. కళాశాలలకు వెళ్లేందుకు.. తిరిగి ఇంటికి చేరేందుకు విద్యార్థులకు బెంగలేదిక. చదువు సమయం వృథా అవుతుందన్న ఆందోళన అవసరం లేదు. సమయానికి అనుగుణంగా ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. రాయితీ ప్రయాణాలు కల్పిస్తూ... విద్యార్థుల బంగారు భవితకు పరోక్షంగా బాటలు వేస్తోంది. 

పార్వతీపురం టౌన్‌: ఆర్టీసీ సంస్థ సేవలను విస్తరిస్తోంది. ఓ వైపు ప్రయాణికులతో పాటు కార్గో సేవలను అందిస్తూ ప్రశంసలు అందుకుంటోంది. అధిక ఆదాయం ఆర్జిస్తోంది. మరోవైపు విద్యార్థులకు సురక్షిత, సుఖమయ ప్రయాణ సదుపాయం కల్పిస్తోంది. విద్యాలయాల సమయానికి అనుగుణంగా బస్సు సర్వీసులు నడుపుతోంది. రాయితీపై పాసులు జారీ చేస్తోంది. దీనివల్ల చదువు సమయం వృథా కాకుండా.. విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు పరోక్షంగా సాయపడుతోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యార్థులు రాకపోకలు సాగించే రూట్లలో ప్రత్యేక బస్‌సర్వీసులను నడుపుతూ సకాలంలో గమ్యస్థానాలకు చేర్చుతోంది. 
 

ప్రత్యేక సర్వీసులు ఇలా..
 
జిల్లాలోని పార్వతీపురం, సాలూరు, పాలకొండ నియోజకవర్గాల్లోని గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వెళ్లే విద్యార్థుల కోసం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. పార్వతీపురం ఆర్టీసీ డిపో నుంచి 3, పాలకొండ నుంచి 5, సాలూరు డిపో నుంచి ఒక బస్సును పాఠశాల, కళాశాల వేళల్లో నడుపుతున్నారు.   


ఉచిత బస్‌పాస్‌లు
 
ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు ఉచిత బస్‌పాస్‌లను జారీ చేస్తోంది. తల్లిదండ్రులకు పిల్లల చదువుల భారం లేకుండా చేస్తోంది. సురక్షిత, సుఖమయ ప్రయాణ సదుపాయం కల్పిస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లాలో 1800 ఉచిత బస్సు పాసులను ఆర్టీసీ అధికారులు జారీ చేశారు. జిల్లాలోని 1,03,733 మంది విద్యార్థులు ఉండగా, అందులో సుమారు 40 శాతం మంది గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చి విద్యను అభ్యసించిన వారే. 12–18 ఏళ్లలోపు విద్యార్థులు 15,970 మందికి 60 శాతం రాయితీపై పాసులు జారీ చేశారు.  

అర్హులందరికీ ఉచిత పాసులు  
ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లాలోని మూడు ఆర్టీసీ డిపోల పరిధిలోని 1800 మంది విద్యార్థులకు ఉచిత బస్సుపాసు లను అందజేశాం. 15, 970 మంది విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా జిల్లాలోని 9 విద్యార్థుల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశాం. విద్యార్థులు ఎక్కువుగా ప్రయాణించే ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాలకు అదనపు బస్సులను పంపించేందుకు చర్యలను చేపట్టాం. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.  
– టీవీఎస్‌ సుధాకర్, జిల్లా ప్రజారవాణా అధికారి, పార్వతీపురం మన్యం  

ఇబ్బందులు లేకుండా... 
గతంలో కళాశాలలకు రావాలన్నా, తిరిగి ఇంటికి వెళ్లాలన్నా బస్సులలో నిలబడి వెళ్లేవాళ్లం. ఒక్కోరోజు బస్సులు ఉండకపోవడంతో ఆటోలపై వెళ్లేవాళం. ఇప్పుడు మా కష్టాలన్నీ తీరాయి. విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా రాయితీతో బస్సు పాసులను అందజేసి సమయానికి ఇంటికి, పాఠశా లలకు, ఇళ్లకు చేరేలా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నారు.                
– సాయి, విద్యార్థి,  పుట్టూరు, పార్వతీపురం మండలం 

సమయానికి చేరుకుంటున్నాం
కళాశాలల సమయానికి చేరుకుంటున్నాం. ఆర్టీసీ మా  ప్రాతం నుంచి పార్వతీపురం పట్టణానికి ప్రత్యేక బస్సు వేశారు. దీనివల్ల ఎటువంటి భయంలేకుండా సమయానికే పాఠశాలలకు చేరుకుంటున్నాం. పాఠశాల పూర్తయిన తరువాత ఆర్టీసీ బస్టాండ్‌లో గంటల తరబడి వేచి ఉండకుండా సమయానికే బస్సు దొరుకుతుంది. తొందరగా ఇళ్లకు చేరుకుంటున్నాం.  
– దేవి ప్రసాద్, కొత్తపల్లి, కురుపాం మండలం

మరిన్ని వార్తలు