ఆనంద ‘తాండవం’

20 Mar, 2021 04:08 IST|Sakshi
తూర్పు గోదావరి జిల్లాలోని ఏలేరు రిజర్వాయర్‌

సాక్షి, అమరావతి: ఏలేరు రిజర్వాయర్‌ కాలువ, తాండవ జలాశయం కాలువలను అనుసంధానం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ అనుసంధానంతో కొత్తగా 5,600 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు తాండవ జలాశయం కింద 51,465 ఎకరాలను స్థిరీకరించాలని నిర్ణయించింది. రూ.470.05 కోట్లతో ఈ పనులు చేపట్టేందుకు జలవనరులశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు శుక్రవారం పరిపాలన అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీచేశారు.  ఈ నిర్ణయంతో విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నం జిల్లాలో గొలుగొండ మండలం జీకే గూడెం వద్ద తాండవనదిపై 4.96 టీఎంసీల సామర్థ్యంతో 1965లో  జలాశయం నిర్మాణం చేపట్టి 1975 నాటికి పూర్తిచేశారు.

తాండవలో నీటి లభ్యత ఆధారంగా ఈ జలాశయం ఒక సీజన్‌లో ఒకటిన్నరసార్లు నిండుతుందని అంచనా వేసిన జలవనరులశాఖ.. విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో 51,465 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించేలా డిస్ట్రిబ్యూటరీ(ప్రధాన కాలువలు, పిల్ల కాలువలు) వ్యవస్థను ఏర్పాటు చేసింది. వర్షాభావ పరిస్థితుల వల్ల నదిలో నీటి లభ్యత తగ్గడంతో ఈ జలాశయం కింద ఆయకట్టుకు నీళ్లందించలేని దుస్థితి నెలకొంది. తాండవ జలాశయాన్ని పూర్తిస్థాయిలో నింపి.. ఆయకట్టును స్థిరీకరించి తమను ఆదుకోవాలన్న ఆ ప్రాంత రైతుల విజ్ఞప్తికి సీఎం సానుకూలంగా స్పందించారు. తాండవ ఆయకట్టును స్థిరీకరించడంతోపాటు ఏలేరు కాలువ పరిసర ప్రాంతాల్లో కొత్తగా ఆయకట్టుకు నీళ్లందించాలని జలవనరులశాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

గోదావరి జలాలతో సస్యశ్యామలం
ఏలేరు రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నీటినిల్వ 24.1 టీఎంసీలు. ఏలేరు పరీవాహక ప్రాంతంలో 17.92 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసిన అధికారులు ఎడమ కాలువ కింద 1.14 లక్షల ఎకరాలు, కుడి కాలువ కింద పదివేల ఎకరాలకు నీరందించేలా ప్రాజెక్టును రూపొందించారు. పోలవరం ఎడమ కాలువ నుంచి పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా ఇప్పటికే ఏలేరు రిజర్వాయర్‌కు గోదావరి జలాలు తరలిస్తుండటం వల్ల నీటి లభ్యత సమస్య ఉండదు. ఏలేరు ఆయకట్టుకు సమర్థంగా నీళ్లందిస్తూనే.. తాండవ ఆయకట్టుకు గోదావరి జలాలను తరలించి సస్యశ్యామలం చేయవచ్చన్న జలవనరులశాఖ ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించింది.

ఏలేరు, తాండవ ఆయకట్టుకు భరోసా
పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే వరకు విశాఖ నగర పారిశ్రామిక, తాగునీటి అవసరాలకు ఏలేరు ఎడమ కాలువ ద్వారా రోజుకు 175 క్యూసెక్కుల చొప్పున నీరు సరఫరా చేయాలని ఏలేరు ప్రాజెక్టు నివేదికలోనే స్పష్టంగా పేర్కొన్నారు. ఏలేరు ప్రాజెక్టు పూర్తయినా ఇప్పటికీ పూర్తి ఆయకట్టుకు నీళ్లందించిన దాఖలాల్లేవు. దీనికి ప్రధాన కారణం ఎడమ కాలువ పనుల్లో లోపాలే. ఏలేరు రిజర్వాయర్‌ వద్ద ఎడమ కాలువ ప్రవాహ సామర్థ్యం వెయ్యి క్యూసెక్కులు, చివరకు వచ్చేసరికి 220 క్యూసెక్కులు ఉండేలా పనులు చేపట్టారు. కానీ.. కాలువను ఇష్టారాజ్యంగా తవ్వడం వల్ల 450 క్యూసెక్కులకు మించి సరఫరా చేయలేని దుస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎడమ కాలువను వెడల్పు చేయడం, లైనింగ్‌ చేయడం ద్వారా 1,250 క్యూసెక్కులకు పెంచవచ్చని, తద్వారా ఎడమ కాలువ కింద పూర్తి ఆయకట్టుకు నీళ్లందిస్తూనే కొత్తగా 5,600 ఎకరాలకు నీళ్లందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఏలేరు ఎడమ కాలువ నుంచి రోజుకు 250 క్యూసెక్కుల చొప్పున తాండవ కాలువలోకి ఎత్తిపోసి, ఆ ప్రాజెక్టు కింద 51,465 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడానికి చర్యలు చేపట్టింది. 

బాబు నిర్లక్ష్యం.. జగన్‌తో సాకారం
సాక్షిప్రతినిధి, రాజమహేంద్రవరం: చంద్రబాబు హయాంలో తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల్లో నిర్లక్ష్యానికి గురైన రైతులను ఆదుకునేందుకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రూ.470 కోట్లు మంజూరు చేసి చరిత్ర సృష్టించారని ప్రభుత్వ విప్, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా చెప్పారు. ఆయన శుక్రవారం రాజమహేంద్రవరంలో విలేకరులతో మాట్లాడారు. ఏలేరు–తాండవ లింక్‌ ప్రాజెక్టుకు ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇవ్వడంతో తూర్పు గోదావరి జిల్లాలోని తుని, ప్రత్తిపాడు, విశాఖ జిల్లా పాయకరావుపేట, నర్సీపట్నం, మాడుగుల, చోడవరం తదితర నియోజకవర్గాల్లో 50 వేల ఎకరాలకు సాగునీరు పుష్కలంగా అందుతుందని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగా, పీఏసీ చైర్మన్‌గా పనిచేసిన యనమల రామకృష్ణుడు 40 ఏళ్ల రాజకీయాల్లో రూ.10 కోట్ల నుంచి రూ.25 కోట్లకు మించి సాధించలేకపోయారని విమర్శించారు. 

మరిన్ని వార్తలు