సచివాలయానికి నీడ

5 Jun, 2022 05:39 IST|Sakshi
నీడనిచ్చే మొక్కలు

వెలగపూడి తాత్కాలిక సచివాలయం వద్ద మొక్కల పెంపకం 

వేప, రావి, మామిడి తదితర నీడనిచ్చే మొక్కలు  

ఈ వర్షాకాలంలోనే ప్లాంటేషన్‌ ప్రారంభం 

గత పాలకులు చేసిన తప్పిదంతో నీడ కరవు 

సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతమైన వెలగపూడిలో తాత్కాలిక భవనాల పేరు చెప్పి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన గత ప్రభుత్వం.. మొక్కలను సైతం తాత్కాలికంగానే బతికేలా చేసింది. ఆ మొక్కలన్నీ కనుమరుగైపోయి, నీడ కరువైపోయింది. ఆ ప్రాంతమంతా ఎడారిలా మంటెక్కిపోతోంది. దీంతో సచివాలయ సిబ్బంది, పోలీసులు, సందర్శకులు నరకాన్ని చవిచూస్తున్నారు.

ఈ పరిస్థితిని గుర్తించిన ప్రస్తుత ప్రభుత్వం ఆ ప్రాంతంలో మళ్లీ పచ్చదనం పరిచి, నీడ కల్పించే చర్యలు చేపట్టింది. సచివాలయ భవనాల పరిసరాల్లో ఇక్కడి మట్టిలో బతికేవి, నీడనిచ్చే 12 వేలకు పైగా మొక్కలను ఈ వర్షాకాలంలో నాటేందుకు సిద్ధం చేస్తోంది. ఇవి కాక అందాన్నిచ్చే మరికొన్ని రకాల మొక్కలూ నాటనున్నారు. 

భవిష్యత్‌ అవసరాలను మరిచి నిర్మాణాలు 
తెలుగుదేశం పార్టీ హయాంలో రాజధాని కోసం 29 గ్రామాలకు చెందిన భూములు తీసుకున్నారు. అప్పటివరకు పచ్చటి తోటలు, పూల వనాలతో ఆహ్లాదకరంగా ఉండే ఈ ప్రాంతం 2016 నాటికి పంటలకు దూరమైపోయింది. వెలగపూడి సమీపంలో అసెంబ్లీ, సచివాయాల భవనాలను దాదాపు 45 ఎకరాల్లో నిర్మించారు.

సింగపూర్, మలేసియా, జపాన్‌ అంటూ అందానికి ప్రాధాన్యం ఇస్తూ ఈ నేలకు సరిపోని మొక్కలను తెచ్చి నాటారు. గత ఆరేళ్లుగా అవి మొక్కలుగానే ఉండిపోగా, చాలావరకు చనిపోయాయి. దాంతో భవనాల పరిసరాల్లో నీడే కరువైపోయింది. వేసవిలో ఎప్పుడూ లేనంతగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి.

గడిచిన మే నెలలో విజయవాడ, గుంటూరులో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా, సచివాలయ ప్రాంగణంలో 43.5 డిగ్రీలకు పైగా నమోదైంది. అంటే ఉష్ణోగ్రతలు సహజంగానే ఎక్కువగా ఉండే ఈ రెండు నగరాలకంటే సచివాలయం వద్ద 1.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత ఉంటోంది. నిత్యం ఇదే పరిస్థితి. 

నీడనిచ్చే మొక్కలు సిద్ధం 
గత పాలకుల తప్పులను గుర్తించిన ప్రస్తుత ప్రభుత్వం వెలగపూడి పరిసరాల్లో నీడనిచ్చేవి, ఇక్కడి మట్టిలో బతికే మొక్కలను నాటాలని సీఆర్డీఏను ఆదేశించింది. గతేడాది సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుకు ఇరువైపులా, రోడ్డు మధ్యన నీడనిచ్చే బాదం జాతి మొక్కలను నాటారు. అవి ఎనిమిది నెలల్లోనే అనుకున్న స్థాయిలో పెరిగాయి. దీంతో అసెంబ్లీ, సచివాలయ భవనాలు ఉన్న ప్రాంతంలోనూ నీడనిచ్చే వేప, రావి, మామిడి, మహాగని వంటి జాతులకు చెందిన మొక్కలను నాటాలని నిర్ణయించారు.

ఉద్దండరాయునిపాలెం, సచివాలయంలో రెండు నర్సరీలు ఏర్పాటు చేసి సుమారు 12 వేలకు పైగా నీడనిచ్చే మొక్కలను, పూల మొక్కలను సిద్ధం చేశారు. జూన్, జూలై నెలల్లో వర్షాకాలంలో వీటిని నాటనున్నారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం ఉన్న ప్రాంతంలో చల్లదనం పెరగాలంటే భవనాలకు చుట్టూ కనీసం కిలోమీటర్‌ పరిధిలో పూర్తిస్థాయిలో నీడనిచ్చే చెట్లు పెంచాలని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

నల్ల ఎడారి
నల్ల సముద్రం, ఎర్ర సముద్రం.. ఇలా కొన్ని సముద్రాలకు రంగుల పేర్లు ఉన్నాయి. ఎడారికి..? ప్రశ్నే లేదు. ఎడారి అంటే ఒకటే. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబేయేది కొత్తది. ఇది నల్ల ఎడారి. ఎక్కడుంది అంటారా..? మన దగ్గరే.. అమరావతి ప్రాంతంలో. గత తెలుగుదేశం పార్టీ సృష్టి. దానిపేరే తాత్కాలిక సచివాలయం.

గత ప్రభుత్వం ఇక్కడి నేల స్వభావానికి సరిపోని విదేశీ మొక్కలు నాటింది. అవి చనిపోవడంతో ఈ ప్రాంతం ఎడారిలా మారింది. నల్ల రేగడి నేలలో ఆ ప్రభుత్వం సృష్టించిన ఎడారి అయినందున దీనిని నల్ల ఎడారి అని అంటున్నారు. 

మరిన్ని వార్తలు