‘జెండాను తాకగానే దేశభక్తిని అనుభూతి చెందుతున్నా’ 

16 Aug, 2022 05:07 IST|Sakshi

దివ్యాంగ విద్యార్థిని మాధురి మాటలను ట్వీట్‌ చేసిన ప్రధాని మోదీ 

తగరపువలస (భీమిలి): ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ సందర్భంగా ఇండియన్‌ పోస్టాఫీస్‌ ఆధ్వర్యంలో విశాఖ జిల్లా ఎండాడలోని ప్రభుత్వ అంధ బాలికల ఆశ్రమ పాఠశాలలో హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని ఈ నెల 12న నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల 9వ తరగతి విద్యార్థిని జాతీయ జెండా చేత పట్టుకుని పరవశించిపోయింది. మాధురి మాట్లాడుతూ ‘ఇంతకు ముందు ఆగస్టు 15న స్కూల్‌లో జెండా ఎగురవేసేవారు. కానీ.. ఇప్పటివరకు నేను జాతీయ జెండాను చూడలేదు.

హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో భాగంగా మన జెండాను తాకడం ద్వారా దేశభక్తిని అనుభూతి చెందుతున్నాను’ అని తెలిపింది. ఆమె భావాలను భారత తపాలా శాఖ సామాజిక మాధ్యమాలలో పోస్ట్‌ చేసింది. దీనిని చూసిన కేంద్ర కమ్యూనికేషన్స్‌ శాఖ మంత్రి అశ్విన్‌ వైష్ణవ్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. దీనిని చూసిన ప్రధాని నరేంద్ర మోదీ రీట్వీట్‌ చేస్తూ ‘ఈ వీడియో ద్వారా ప్రతి భారతీయుడు మూడు రంగుల జెండాతో సుదీర్ఘమైన అనుబంధం కలిగి చేరువ అయినట్టు అర్థమవుతోంది’ అని పేర్కొన్నారు. మాధురిని ప్రిన్సిపాల్‌ ఎం.మహేశ్వరరెడ్డి అభినందించారు.
 
మాధురి మాటలను ట్విట్టర్‌లో షేర్‌ చేసిన కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్, రీ ట్వీట్‌ చేసిన ప్రధాని మోదీ (ఇన్‌సెట్‌లో మాధురి) 

మరిన్ని వార్తలు