ఎక్కడి వినతులు అక్కడే

8 Feb, 2021 05:44 IST|Sakshi

యజమానులకు తలనొప్పిగా మారిన పీఓబీ ఆస్తులు

పరిష్కారం పట్టని అధికారులు

ఎనిమిది నెలల్లో తొమ్మిదే పరిష్కారం

72 శాతానికి పైగా గడువు దాటిన అర్జీలు పెండింగే

సాక్షి, అమరావతి: నిషేధిత ఆస్తుల జాబితాలోని ఆస్తులు యజమానులకు తలనొప్పిగా మారాయి. ప్రభుత్వం అసైన్‌మెంట్‌ కింద పేదలకిచ్చిన భూములన్నీ ఈ జాబితాలోనే ఉంటాయి. వాటిని పట్టాదారులు లేదా వారి వారసులు అనుభవించడానికి తప్ప ఇతరులకు బదలాయించడానికి, విక్రయించడానికి ఎలాంటి హక్కులు ఉండవు. అయితే, దురదృష్టవశాత్తూ కొన్ని ప్రైవేటు భూములు కూడా పీఓబీ జాబితాలో ఉన్నాయి. ఒక సర్వే నంబరులో పదెకరాలు ఉండి అందులోని ఐదెకరాలు ప్రభుత్వ భూమి ఉందనుకుంటే.. అది మాత్రమే నిషేధిత ఆస్తుల జాబితాలో ఉండాలి. కానీ, మిగిలిన ఐదెకరాల ప్రైవేటు భూమి కూడా పీఓబీలో ఉంటోంది. దీంతో అత్యవసర సమయాల్లో యజమానులు వాటిని విక్రయించాలన్నా, ఎవరికైనా బహుమతి కింద రిజిస్టర్‌ చేయాలన్నా వీలుకావడంలేదు. అందువల్ల ప్రొహిబిషన్‌ ఆర్డర్‌ బుక్‌ (పీఓబీ) జాబితాలో ఉన్న భూములను అందులో నుంచి తొలగించాలంటూ భూ యజమానుల నుంచి దరఖాస్తులు వస్తున్నాయి. 

పెండింగ్‌లోనే దరఖాస్తులు
► నిజంగా అవి ప్రైవేటు భూములైతే వాటిని పీఓబీ జాబితా నుంచి తొలగించాలంటూ జిల్లా కలెక్టర్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులకు పంపించాలి. కలెక్టర్ల నుంచి వచ్చిన జాబితా ప్రకారం స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖకు చెందిన జిల్లా రిజిస్ట్రార్లు పీఓబీలోని జాబితాను సవరిస్తారు. 
► గత ఏడాది జూన్‌ ఒకటో తేదీ నుంచి జనవరి నెలాఖరు వరకూ ఎనిమిది నెలల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా పీఓబీ నుంచి తొలగించాలంటూ రెవెన్యూ శాఖకు 3,255 దరఖాస్తులు మీసేవ కేంద్రాల ద్వారా అందాయి. అయితే, అధికారులు వీటిలో తొమ్మిదింటిని మాత్రమే ఆమోదించి 42 తిరస్కరించారు. 
► మిగిలిన 3,204 అర్జీలు పెండింగులో ఉండటం గమనార్హం. మీసేవ నుంచి వచ్చిన ఈ దరఖాస్తులు కాకుండా తమ భూములను పీఓబీ నుంచి తొలగించాలంటూ నేరుగా అధికారులకు సమర్పించిన వినతులకు లెక్కేలేదు. 
► మొత్తం దరఖాస్తుల్లో 72 శాతానికి పైగా గడువు దాటినా పరిష్కారానికి నోచుకోలేదు. 
► ఒక్కటంటే ఒక్క దరఖాస్తును కూడా పరిష్కరించని జిల్లాలు అధికంగా ఉన్నాయి. ఈ వినతుల పరిష్కారం విషయంపై అధికారులు ఏమాత్రం శ్రద్ధ చూపడంలేదనడానికి ఈ గణాంకాలే నిదర్శనం.  

మరిన్ని వార్తలు