యుద్ధప్రాతిపదికన విద్యుత్‌ పునరుద్ధరణ పనులు

14 Jul, 2022 03:47 IST|Sakshi
కోనసీమలో నీట మునిగిన విద్యుత్‌ స్తంభాలు, వైర్లను పునరుద్ధరిస్తున్న సిబ్బంది

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు, పోటెత్తుతున్న గోదావరి వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్‌ తూర్పు, మధ్య ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)ల పరిధిలోని విద్యుత్‌ వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లింది. అనేక గ్రామాల్లో ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. అనేక చోట్ల ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలు కుప్పకూలాయి. వాటిని పునరుద్ధరించేందుకు అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి యుద్ధప్రాతిపదికన పనులు జరిపిస్తున్నారు. ఏపీఈపీడీసీఎల్‌ పరిధిలోని రాజమండ్రి, అమలాపురం, రంపచోడవరం, రామచంద్రపురం, జంగారెడ్డిగూడెం, నిడదవోలు డివిజన్లలో 33/11 కేవీ సబ్‌స్టేషన్లు 5 దెబ్బతినగా ఒక సబ్‌స్టేషన్‌లో విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించారు.

33 కేవీ ఫీడర్‌ ఒకటి పాడైంది. 11 కేవీ ఫీడర్లు 29 పాడయ్యాయి. 11 కేవీ స్తంభాలు 534, 11 కేవీ లైన్లు 20 కిలోమీటర్లు, ఎల్‌టీ స్తంభాలు 557, డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు 2,326 దెబ్బతిన్నాయి. 4 మండలాలు, 241 గ్రామాలు, 2548 వ్యవసాయ,33226 వ్యవసాయేతర సర్వీసులకు 62 ప్రత్యేక బృందాలతో విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ పనులు జరుగుతున్నట్లు డిస్కం సీఎండీ సంతోషరావు ‘సాక్షి’కి తెలిపారు. ఏపీసీపీడీసీఎల్‌ పరిధిలోని విజయవాడ, సీఆర్‌డీఏ, గుంటూరు, ఒంగోలు జిల్లాల్లో 33 కేవీ ఫీడర్లు 2, 33కేవీ స్తంభాలు 7, 11కేవీ ఫీడర్లు 13 దెబ్బతినగా వాటిని పునరుద్ధరించారు.

11కేవీ స్థంభాలు 173 పడిపోగా వాటిలో 104 నిలబెట్టారు. డిస్కం మొత్తం మీద 11కేవీ లైన్లు 3.54 కిలోమీటర్ల మేర తెగిపోగా బుధవారానికి 2.56 కి.మీ మేరకు బాగు చేశారు. ఎల్‌టీ లైన్లు 12.73 కి.మీ దెబ్బతినగా, 5 కి.మీ సరిచేశారు. ఎల్‌టీ స్తంభాలు 242 ఒరిగిపోగా 211 స్తంభాలను పునరుద్ధరించారు. డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు (డీటీఆర్‌) 77 దెబ్బతిన్నాయి. వీటి స్థానంలో 31 డీటీఆర్‌లను ఏర్పాటు చేశారు.  

ప్రమాదాలు జరగవచ్చు.. జాగ్రత్త 
భారీ వర్షాలు, వరదల కారణంగా విద్యుత్‌ ప్రమాదాలు జరిగే అవకాశముందని, విద్యుత్‌ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని డిస్కంల సీఎండీలు విజ్ఞప్తి చేశారు. కరెంటుతో సంబంధం ఉండే ఏ వస్తువునైనా ఒకటికి రెండుసార్లు పరిశీలించిన తరువాతే తాకాలని సూచించారు. విద్యుత్‌ సమస్యలు తలెత్తితే టోల్‌ ఫ్రీ నంబర్‌ 1912కు తెలియజేయాలన్నారు. 

మరిన్ని వార్తలు