‘పోలవరం’ గ్రామాల్లో ముంపు అవాస్తవం

15 Jul, 2021 08:52 IST|Sakshi

ఈనాడు కథనాన్ని ఖండించిన ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్‌ ఆనంద్‌

సాక్షి, అమరావతి: పోలవరం ఎగువ కాఫర్‌ డ్యాం ప్రభావం వల్ల ప్రాజెక్టు ముంపు గ్రామాలను వరద చుట్టుముట్టిందంటూ బుధవారం ఈనాడులో ‘నది సంద్రంలో విలవిల’ శీర్షికన ప్రచురించిన కథనంలో వాస్తవాలు లేవని పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్‌ ఒ.ఆనంద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలో మాల్టూరు, మాడిపల్లి, మూలపాడు, పెనికలపాడు, అణుగుల గూడెం, దేవీపట్నం, తొయ్యేరు తదితర గ్రామాల ప్రజలు వరద చుట్టుముట్టడం వల్ల ఇళ్లను ఖాళీ చేసి బయటకు వెళ్లినట్టు ఆ కథనంలో పేర్కొన్నారని తెలిపారు.

తొయ్యేరు మినహా మిగిలిన గ్రామాలన్నీ 25.72 మీటర్ల కాంటూరుకు ఎగువన ఉన్నవేనని స్పష్టం చేశారు. ఆ గ్రామాల్లో 2,200 కుటుంబాలకు గాను 2,158 కుటుంబాలు స్వచ్ఛందంగా ప్రభుత్వం కట్టిన ఇళ్లు లేదా వారే నిర్మించుకున్న ఇళ్లలోకి తరలి వెళ్లాయన్నారు. ఇందులో 1,303 కుటుంబాలకు రూ.83.64 కోట్లు పరిహారంగా చెల్లించామన్నారు. తొయ్యేరులో 670 కుటుంబాలకు గాను 585 కుటుంబాలు ముసళ్లకుంట, కృష్ణునిపాలెం కాలనీల్లో ప్రభుత్వం నిర్మించిన ఇళ్లలోకి తరలి వెళ్లాయన్నారు. వీరికి రూ.32.86 కోట్లు చెల్లించామన్నారు.  

మరిన్ని వార్తలు