AP: ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి.. బడికి నిధుల వెల్లువ

14 Oct, 2022 11:42 IST|Sakshi

 ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలల నిర్వహణకు గ్రాంట్స్‌

 ఉమ్మడి నెల్లూరు జిల్లాకు రూ.8.88 కోట్లు కేటాయించిన ప్రభుత్వం

స్కూళ్ల వారీగా  కొంత మొత్తం విడుదల

గత ప్రభుత్వంలో ప్రధానోపాధ్యాయులే ఖర్చు చేసిన దుస్థితి

టీడీపీ ప్రభుత్వ హయాంలో సర్కారు పాఠశాలల నిర్వహణను గాలికొదిలేశారు. వాటి అభివృద్ధి గురించి   పట్టించుకున్న పాపాన పోలేదు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చింది. నాడు–నేడు పథకాన్ని ప్రవేశపెట్టి బడుల రూపురేఖలు మార్చేశారు. అంతేకాకుండా నిర్వహణ కోసం ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తున్నారు. దీనిపై సర్వత్రా హర్షాతిరేకాలు  వ్యక్తమవుతున్నాయి. 

నెల్లూరు(టౌన్‌): పాఠశాలల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులను మంజూరు చేసింది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఖర్చు చేయనున్నారు. గత ప్రభుత్వ హయాంలో అరకొరగా నిధులు విడుదల చేసేవారు. అది కూడా విద్యాసంవత్సరం ముగిసే సమయంలో వచ్చేవి. ఒక్కోసారి రెండేళ్ల నుంచి మూడేళ్లు వరకు కూడా నిధులు విడుదల చేసేవారు కాదు.

దీంతో స్కూళ్ల నిర్వహణకు ప్రధానోపాధ్యాయులు తమ జేబుల్లో నుంచి డబ్బు తీసి ఖర్చు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి పరిస్థితి మారింది. సకాలంలో నిధులను కేటాయించి విడుదల చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించారు. నాడు–నేడు, జగనన్న విద్యాకానుక, అమ్మఒడి, జగనన్న గోరుముద్ద తదితర పథకాలతో అండగా నిలిచారు. 

తక్షణ గ్రాంట్‌ కింద..
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొత్తం 3,343 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వాటి నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.8,88,45,000 గ్రాంట్‌ను మంజూరు చేసింది. తక్షణం గ్రాంట్‌ కింద రూ.1,77,69,000ను ఇటీవల విడుదల చేసింది. కాంపోజిట్‌ గ్రాంట్స్‌ను పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా కేటాయిస్తారు. 1 నుంచి 30 మంది ఉండే స్కూల్‌కి రూ.10 వేలు, 31 నుంచి 100 మంది ఉంటే రూ.25 వేలు, 101 నుంచి 250 మంది ఉంటే రూ.50 వేలు, 251 నుంచి 1,000 మంది ఉంటే రూ.75 వేలు, 1,000 మందిపైన ఉండే బడికి రూ.లక్ష ఇస్తారు. ఈ నిధులను విద్యుత్‌ బిల్లులు, స్టేషనరీ, వాటర్‌ బిల్లులు, మైనర్‌ రిపేర్స్‌ తదితర వాటికి ఖర్చు చేయాలి. 

ఎమ్మార్సీలకు ఇలా..
మండల రీసోర్స్‌ సెంటర్లకు నిధులు విడుదల చేశారు. ఉమ్మడి జిల్లా పరిధిలో మొత్తం 47 మండల రీసోర్స్‌ సెంటర్లున్నాయి. ఒక్కో దానికి రూ.70 వేలు చొప్పున రూ.32.90 లక్షలను ఇచ్చారు. ఎమ్మార్సీల నిర్వహణలో భాగంగా విద్యుత్‌ బిల్లులు, స్టేషనరీ, టెలిఫోన్లు, కంప్యూటర్ల నిర్వహణ తదితర వాటికి నగదును ఖర్చు చేయనున్నారు. 

సీఆర్సీలకు.. 
జిల్లా వ్యాప్తంగా మొత్తం 318 స్కూల్‌ కాంప్లెక్స్‌లున్నాయి. ఒక్కో దానికి రూ.19 వేలు చొప్పున రూ.60.42 లక్షలు నిధులను విడుదల చేశారు. అదే విధంగా ఒక్కో స్కూల్‌ కాంప్లెక్స్‌కు మొబైల్‌ సపోర్ట్‌ టు సీఆర్సీ కింద రూ.1,000 రూ.3.18 లక్షలను ప్రభుత్వం విడుదల చేసింది. జిల్లాలోని మొత్తం 318 స్కూల్‌ కాంప్లెక్స్‌లకు రూ.63.60 లక్షల నిధులను విడుదల చేసింది. దీనిపై ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

యూసీలు అందజేయాలి 
పాఠశాలలకు విడుదల చేసిన కాంపోజిట్‌ గ్రాంట్స్‌ ఖర్చులపై యుటిలైజేషన్‌ సర్టి ఫికెట్లను ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అందజేయాలి. గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా మున్సిపల్‌ స్కూళ్లకు కూడా కాంపోజిట్‌ నిధులను విడుదల చేశారు. ఇప్పటికే స్కూల్‌ మెయింటెనెన్స్, టాయ్‌లెట్‌ గ్రాంట్స్‌ను ఆయా పాఠశాలలకు అందజేశాం. స్కూల్‌ కాంప్లెక్స్‌ల అభివృద్ధికి దోహదపడాలి.
 – ఉషారాణి, ఏపీసీ, సమగ్రశిక్ష 

మరిన్ని వార్తలు