నెల రోజుల్లో నిర్వాసితులకు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ 

29 Oct, 2021 04:03 IST|Sakshi
నిర్వాసితుల సమస్యలు తెలుసుకుంటున్న ఆర్‌ అండ్‌ ఆర్‌ కమిషనర్‌ సి. శ్రీధర్, ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్‌ ఆనంద్‌

‘పోలవరం’ గ్రామాలను సందర్శించిన కమిషనర్‌ శ్రీధర్‌ 

దేవీపట్నం: అర్హులైన పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులందరికీ నెలరోజుల వ్యవధిలోనే   గ్రామాల వారీగా ప్యాకేజీ సొమ్మును అందజేస్తామని ఆర్‌అండ్‌ఆర్‌ కమిషనర్‌ సి. శ్రీధర్‌ స్పష్టం చేశారు. గురువారం ఆయన పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్‌ ఒ.ఆనంద్‌తో కలసి తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో పలు పునరావాస కాలనీలను సందర్శించారు. ఇందుకూరు పంచాయతీలో నిర్మించిన పెదభీంపల్లి3, ఇందుకూరు2, ముసుళ్లకుంట కాలనీలను సందర్శించారు. ఇళ్లు, మరుగుదొడ్లు, రహదారులు, డ్రెయిన్లు, పాఠశాల, అంగన్‌వాడీ, గ్రామసచివాలయం, తదితర ప్రభుత్వ భవనాల నిర్మాణాలను పరిశీలించారు.

నిర్వాసితులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి వినతి పత్రాలు సమర్పించారు. కమిషనర్‌ మాట్లాడుతూ.. దాదాపు రూ.90 కోట్ల మేర బిల్లులు నిర్వాసితులకు అందాల్సి ఉందన్నారు. ఇప్పటివరకు అనర్హుల జాబితాలో ఉన్నవారి వాస్తవాలను పరిశీలించి.. 10 రోజుల్లో ప్యాకేజీ పొందేందుకు అర్హులా కాదా అన్న విషయాన్ని స్పష్టం చేస్తామని తెలిపారు. అనంతరం కొండమొదలు పంచాయతీలోని కొంతమందికి గంగవరం మండలం నేలదోనెలపాడు వద్ద నిర్మించిన  పునరావాస కాలనీని సందర్శించారు.   

మరిన్ని వార్తలు