శభాష్‌ సంర్పంచ్‌.. ప్రథమ పౌరుడి ‘పాఠ’వం | Sakshi
Sakshi News home page

శభాష్‌ సర్పంచ్‌.. ప్రథమ పౌరుడి ‘పాఠ’వం

Published Fri, Oct 29 2021 4:08 AM

Sarpanch Is Offering Free Education To Students In Bhadradri Kothagudem District - Sakshi

అశ్వారావుపేట రూరల్‌: తన చదువుకు సార్థకత చేకూరుస్తూ ఆ ఊరి ప్రథమ పౌరుడైన సర్పంచ్‌ విద్యార్థులకు ఉచితంగా విద్య అందిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని వేదాంతపురం గ్రామపంచాయతీ సర్పంచ్‌ సోని శివశంకర ప్రసాద్‌ బీఈడీ పూర్తిచేశాడు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీకి ముందు మండలంలోని పాత నారంవారిగూడెం గ్రామం ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యా వలంటీర్‌గా పనిచేశాడు.

రాజకీయాల మీద ఆసక్తితో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశాడు. గెలిచాక ఉద్యోగానికి రాజీనామా చేశాడు. కరోనా మొదటి వేవ్‌ సమయంలో లాక్‌డౌన్‌తో పాఠశాలలు మూతపడ్డాయి. విద్యార్థులు ఆటపాటలతో కాలక్షేపం చేస్తూ విద్యకు దూరమవుతున్నట్లు ప్రసాద్‌ గుర్తించాడు. గ్రామసభ ఏర్పాటుచేసి విద్యార్థులందరికీ రాత్రి పూట ఉచితంగా ట్యూషన్‌ చెబుతానని, పిల్లలను క్రమం తప్పకుండా పంపించాలని తల్లిదండ్రులకు సూచించాడు.

సర్పంచే ఉచితంగా ట్యూషన్‌ చెప్తాననడంతో తల్లిదండ్రులు పిల్లలను పంపించడం ఆరంభించారు. కరోనా కాలంలో ప్రారంభించినా... పాఠశాలలు తెరిచాక కూడా ట్యూషన్‌ కొనసాగుతున్నది. గ్రామ చిన్నారులకు నేటి పోటీ ప్రపంచానికి తగినట్లు తీర్చిదిద్దాలని డిజిటల్‌ తరగతులు అందుబాటులోకి తెచ్చాడు. ట్యూషన్‌కు వస్తున్న పిల్లల్లో 1 నుంచి 5వ తరగతి విద్యార్థులే అధికంగా ఉన్నారు. వీరికోసం రూ.25వేల సొంత ఖర్చుతో ఎల్‌ఈడీ టీవీని కొనుగోలు చేశాడు. దీని ద్వారా విద్యార్థులకు డిజిటల్‌ బోధన సైతం అందిస్తున్నాడు.  

‘శ్రీ గంగానమ్మ తల్లి పాఠశాల’గా...  
మొదట్లో సర్పంచ్‌ ఒక్కరే పిల్లలకు ట్యూషన్‌ చెప్పగా, ఆ తర్వాత అదే గ్రామానికి చెందిన బీఈడీ, టీటీసీ పూర్తిచేసిన నాగలక్ష్మి కూడా ట్యూషన్‌ చెప్పేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చింది. అదే గ్రామంలోని వనంలో కొలువుదీరిన శ్రీ గంగానమ్మ తల్లి అమ్మవారి పేరుతో ‘శ్రీ గంగానమ్మ తల్లి పాఠశాల’గా నామకరణం కూడా చేశారు. 

Advertisement
Advertisement