కచ్చిడి చేపలతో ఒక్కరోజులోనే మిలియనీర్‌.. ఎందుకింత విపరీతమైన క్రేజ్‌?

16 Aug, 2023 09:59 IST|Sakshi

సముద్రంలో దొరికే మత్స్యరాజం 

బురదగా ఉండే ప్రాంతాల్లో ఆవాసం 

కచ్చిడి చేప మాంసంలో పలు విటమిన్లు, మినరల్స్‌  

ఆగ్నేయాసియా దేశాల్లో విపరీతమైన క్రేజ్‌ 

ఏపీ సెంట్రల్‌ డెస్క్:  మహారాష్ట్రకు చెందిన ఓ జాలరికి దొరికిన కచ్చిడి చేపలతో ఒక్క రోజులోనే మిలియనీర్‌ అయిపోయాడు. యాభై కేజీల కచ్చిడి చేప కలకత్తాలో రూ.13 లక్షలకు అమ్ముడుబోయింది. కాకినాడ కుంభాభిషేకం రేవులో కచ్చిడి చేప 4 లక్షల రూపాయలు పలికింది. కోనసీమలోని అంతర్వేది తీరంలో కచ్చిడి దొరికిన మత్స్యకారుడిపై కాసుల వర్షం కురిసింది. ఇలాంటి వార్తలు తరచూ చూస్తున్నాం.

అసలేంటీ కచ్చిడి చేప. పులసకే తాతలా ఉంది. కళ్లు బైర్లు కమ్మే రేటు ఎందుకు పలుకుతోంది. కేజీ రూ. 20 వేలకు పైగా ధర పలికేంత విషయం కచ్చిడిలో ఏముంది. సింగపూర్, మలేసియా, హాంగ్‌కాంగ్, థాయ్‌లాండ్, జపాన్, ఇదర ఆగ్నేయాసియా దేశాల్లో దీనికి అంత డిమాండ్‌ ఎందుకు.. అంటే ఇది ఔషధాల గని కాబట్టి.      

బురద ప్రాంతాల్లో నివాసం 
హిందూ మహా సముద్రం, దక్షిణ పసిఫిక్‌ మహా సముద్రంలో ఇవి నివసిస్తాయి. పర్షియన్‌ గల్ఫ్, భారత్‌ తీరం, జపాన్, పవువా న్యూగినియా, ఉత్తర ఆ్రస్టేలియా సముద్ర ప్రాంతంలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. నదీ ముఖద్వారాలు సమీపంలో, అడుగున బురదగా, బండరాళ్లు ఉండే ప్రాంతాల్లో జీవిస్తాయి. సాధారణంగా ఇవి 60 మీటర్ల లోతులో సంచరిస్తూ ఉంటాయి. ఆహారం కోసం వలస వెళ్తూ ఉంటాయి.  

ఎన్నో పేర్లు..  
ఆంధ్రప్రదేశ్‌ కోస్తా ప్రాంతంలో కచ్చిడిగా పిలుస్తున్న ఈ చేప శాస్త్రీయ నాయం ప్రొటోనిబియా డయాకాంథస్‌. దీనిని ఘోల్‌ ఫిష్‌ అని, సీ గోల్డ్‌ అని కూడా పిలుస్తారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ ప్రాంతాల్లో టెలియా భోలా, కచ్చర్‌ భోలా అని అంటారు. ప్రపంచ వ్యాప్తంగా దీనిని బ్లాక్‌స్పాటెడ్‌ క్రోకర్‌ అని, ఆ్రస్టేలియాలో బ్లాక్‌ జ్యూఫిష్‌ అని  అంటారు.     

జీవితకాలం 15 ఏళ్లు.. 
వీటి నోరు పెద్దగా ఉంటుంది. పక్కన నాలుగు రెక్కలు (ఫిన్స్‌), వెన్నుముక పొడవునా మరో ఫిన్‌ ఉంటుంది. రెండు వెన్నుముకలతో పొట్ట తర్వాత నుంచి కిందకు వంగి.. తోకవరకు సన్నగా ఉంటుంది. ఇవి అవకాశాన్ని బట్టి అన్ని రకాల ఆహారాలను తింటాయి. ముఖ్యంగా పీతలు, రొయ్యలు, లాబ్‌స్టర్‌లను ఇష్టంగా లాగిస్తాయి. చిన్న చేపలను వేటాడతాయి. సముద్రంలో ఎక్కడెక్కడ తిరిగినా ఏటా గుడ్లు పెట్టే సమయానికి మాత్రం తమ ఆవాసాలకు గుంపులుగా చేరతాయి.

మే నుంచి అక్టోబర్‌ మధ్య కాలంలో నదులు సముద్రంలో కలిసే చోట్లకు వచ్చి గుడ్లుపెడతాయి. వీటి జీవితకాలం 15 ఏళ్లు. అయితే పుట్టినప్పటి నుంచి చాలా వేగంగా ఎదుగుతాయి. నాలుగేళ్లలోనే మూడు అడుగుల సైజుకు పెరిగి సంతానోత్పత్తికి సిద్ధమవుతాయి. ఐదు అడుగుల వరకూ కూడా పెరిగే ఇవి.. 60 కేజీలకు పైగా బరువుతూగుతాయి.   
ఎన్నో ఉపయోగాలు 
కచ్చిడి చేపలోని ఔషధ గుణాల వల్లే దానికంత క్రేజ్‌ వచ్చింది. ఐయోడిన్, ఒమెగా–3, డీహెచ్‌ఏ, ఈపీఏ, ఐరన్, మెగ్నీషియం, సెలీనియం లాంటి మినరల్స్‌ గని ఈ చేప. దీని కడుపు క్రింది భాగంలో చిన్న సంచిలాంటి శరీర భాగం ఉంటుంది. ఆ సంచిలో లభించే ఔషధాల వల్ల మార్కెట్‌లో దీనికి విపరీతమైన డిమాండ్‌ ఉంటుంది. ఈ సంచి కారణంగానే దీనిని సీ గోల్డ్‌ అని పిలుస్తారు.   

  • ఈదడానికి ఉపయోగపడే వీటి రెక్కలతో సింగపూర్‌లో వైన్‌ తయారు చేస్తారు.  
  •  కంటి చూపును మెరుగుపరిచే చాలా విటమిన్స్, మినరల్స్, ప్రొటీన్స్‌ ఈ చేపలో పుష్కలంగా లభిస్తాయి.
  • ఈ చేపలో చర్మానికి అవసరమైన ప్రొటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. దీనితో చర్మంపై ముడతలు పడవు. ముదిమి ఛాయలు దరిదాపులకు రాకుండా నవయవ్వనంగా చర్మం మెరుస్తుంది.  
  •  చిన్న పిల్లల్లో మొదడు సక్రమంగా ఎదుగుదలకు ఈ చేపలో పెద్దఎత్తున లభించే ఒమెగా–3 ఎంతో ఉపయోగపడుతుంది. క్రమం తప్పక తింటూ ఉంటే ఐక్యూ (ఇంటెలిజెన్స్‌ కొషెంట్‌) కూడా బాగా అభివృద్ధి చెందుతుంది.  
  • కచ్చిడిలోని విటమిన్స్, మినరల్స్‌ మన శరీరంలోని కండరాలు బలంగా మారడానికి ఎంతో దోహదపడతాయి.  

ప్రమాదంలో కచ్చిడి.. 
ప్రపంచ దేశాల్లో అతిగా వేటాడటం, తీర ప్రాంతం కాలుష్యంగా మారడం వల్ల దీని ఉనికికే ప్రమాదం ఏర్పడుతోంది. గుడ్లు పెట్టేందుకు తీర ప్రాంతాలకు వచ్చే సమయంలో వీటిని ఎక్కువగా వేటాటం వల్ల వాటి సంఖ్య విపరీతంగా తగ్గిపోతోంది. ఇటీవల కాలంలో దీనిని రక్షించడానికి ఆ్రస్టేలియా కొన్ని కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. అలాగే భారత్‌ తీర ప్రాంతంలో మెకనైజ్డ్‌ బోట్లతో వేట నిషేధం, ఇవి గుడ్లు పెట్టే సీజన్‌లో వేటకు విశ్రాంతి ప్రకటించడం వల్ల వీటికి రక్షణ లభిస్తోంది.  
 

మరిన్ని వార్తలు