సాక్షి ఎఫెక్ట్‌: విధుల నుంచి ఐటీడీఏ పీవో తొలగింపు

13 Jun, 2021 09:12 IST|Sakshi

లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణకు ఆదేశం

సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉద్యోగం ఇప్పిస్తానని ప్రలోభపెట్టి తనపై లైంగిక వేధింపులకు  పాల్పడ్డారంటూ ఓ యువతి ఆరోపించిన నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా కేఆర్‌ పురం ఐటీడీఏ పీవో ఆర్‌వీ సూర్యనారాయణను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనను ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ‘ఐటీడీఏ పీవోపై లైంగిక ఆరోపణలు’ శీర్షికన శనివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై స్పందించిన కలెక్టర్‌ ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించటంతోపాటు ఆయనపై చర్యలకు ఉపక్రమించారు.

ఐటీడీఏ బాధ్యతలను జంగారెడ్డిగూడెం ఆర్‌డీవో వైవీ ప్రసన్నలక్ష్మికి  అప్పగించారు. మరోవైపు పోలీసులు కూడా ఈ వ్యవహారంపై విచారణ చేపట్టారు. ఇదిలావుండగా పీవోకు అనుకూలంగా ఓ వర్గం రంగంలోకి దిగి ఇకపై ఎవరూ ఆయనపై ఫిర్యాదు చేయకుండా బాధితులను బుజ్జగించే ప్రయత్నాలు ప్రారంభించారు. శనివారం ఉదయం కూడా పీవోపై ఆరోపణలు చేసిన సదరు యువతి సాయంత్రానికి మాట మార్చింది. తనను కొంతమంది బ్లాక్‌మెయిల్‌ చేసి పీవోకు వ్యతిరేకంగా చెప్పించారంటూ మరో వీడియో విడుదల చేసింది.

చదవండి: దారుణంగా హత్య చేసి.. గుంతలో పడేసి..  
గుంటూరులో సైకో వీరంగం

మరిన్ని వార్తలు