3 నెలల్లో 15,032 మందికి ఉపాధి

13 Sep, 2022 05:27 IST|Sakshi

ఏపీఎస్‌ఎస్‌డీసీ జాబ్‌ మేళాలకు విశేష స్పందన

రూ.10వేల నుంచి రూ.40వేలు వేతనంతో ఉద్యోగాలు

ఫ్లిప్‌కార్ట్, డైకిన్‌ వంటి ఎంఎన్‌సీల్లో ఉపాధి

ఈ ఏడాది 45,000 మందికి ఉపాధి లక్ష్యం

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న జాబ్‌ మేళాలకు మంచి స్పందన వస్తోంది. ఈ జాబ్‌ మేళాల ద్వారా కేవలం మూడు నెలల్లోనే 15,032 మంది విద్యార్థులకు ఉద్యోగాలు లభించాయి. కరోనా కారణంగా గత రెండేళ్లు ఆన్‌లైన్‌ జాబ్‌ మేళాలకు మాత్రమే పరిమితమైన ఏపీఎస్‌ఎస్‌డీసీ... ఇప్పుడు నేరుగా కళాశాలల్లోనే జాబ్‌ మేళాలను నిర్వస్తోంది.

ఈ విద్యా సంవత్సరం జూన్‌ నుంచి ఆగస్టు వరకు రాష్ట్ర వ్యాప్తంగా 142కు పైగా జబ్‌మేళాలను నిర్వహించగా, 37,879 మంది విద్యార్థులు హాజరైనట్లు ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ ఎస్‌.సత్యనారాయణ ‘సాక్షి’కి తెలిపారు. ఈ జాబ్‌ మేళాల్లో 146కు పైగా ప్రఖ్యాత కంపెనీలు పాల్గొన్నాయని పేర్కొన్నారు. గత మూడు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన జాబ్‌ మేళాల ద్వారా 15,032 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికైనట్లు వివరించారు.

వారికి అర్హతల ప్రకారం రూ.10 వేల నుంచి రూ.40 వేల వరకు నెలవారీ వేతనం ఇవ్వడానికి కంపెనీలు సిద్ధమయ్యాయని తెలిపారు. గత మూడు నెలల్లోనే ఫ్లిప్‌కార్ట్‌ ఏకంగా 2,000 మందికిపైగా విద్యార్థులను ఎంపిక చేసుకోగా, డైకిన్‌ వంటి పలు ఎలక్ట్రానిక్‌ కంపెనీలు, ప్రైవేట్‌ బ్యాంకులు, హాస్పిటల్స్‌ వంటి సంస్థలు అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్నాయి. ఈ విద్యా సంవత్సరం ముగిసేలోపు జాబ్‌ మేళాల ద్వారా 45,000 మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు. 

కంపెనీలకు అవసరమైన నిపుణుల కోసం స్కిల్‌ హబ్స్‌ 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఏర్పాటైన కంపెనీల్లో స్థానికులకే ఉపాధి కల్పించాలి. ఈ క్రమంలో కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలను విద్యార్థుల్లో పెంపొందించే విధంగా ఏపీఎస్‌ఎస్‌డీసీ చర్యలు చేపట్టిందని సత్యనారాయణ తెలిపారు. ఇందుకోసం ప్రతి నియోజకవర్గంలో స్కిల్‌ హబ్స్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

స్థానిక కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలను అందించే విధంగా ఈ స్కిల్‌ హబ్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. తొలి దశలో 66 స్కిల్‌ హబ్స్‌ను సిద్ధం చేశామని, త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. ఏటా 42,000 మందికి శిక్షణ ఇచ్చే విధంగా ఈ స్కిల్‌ హబ్స్‌ను రూపొందించినట్లు చెప్పారు. శిక్షణ అనంతరం అదే కంపెనీలో ఉద్యోగం ఇచ్చే విధంగా పలు సంస్థలతో ఏపీఎస్‌ఎస్‌డీసీ ఒప్పందాలు చేసుకుంటోంది. 

మరిన్ని వార్తలు