కుప్పం దెబ్బతో సహనం కోల్పోయారు 

26 Feb, 2021 00:32 IST|Sakshi
స్వరూపానందేంద్ర స్వామీజీని చంద్రబాబు కలిసిన ఫొటోను చూపిస్తున్న సజ్జల 

చంద్రబాబు అదుపుతప్పి అసభ్యకరంగా మాట్లాడుతున్నారు 

దీనిపై ఎవరైనా ఆవేశపడితే బాధ్యత ఆయనదే

నాడు స్వామీజీకి సలాం కొట్టి... ఇప్పుడు విమర్శలా?

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజం  

సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల్లో కుప్పంలో ఘోర పరాభవం ఎదురవ్వడంతో టీడీపీ అధినేత చంద్రబాబు సహనం కోల్పోతున్నారని, నిజస్వరూపమేంటో బయటపడుతోందని ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రెచ్చగొట్టేలా, వ్యక్తిగత దూషణలకు దిగుతున్న చంద్రబాబు.. జరగబోయే పరిణామాలకు తానే బాధ్యత వహించాలని, ఎవరైనా ఆవేశపడితే అది ఆయన స్వయంకృతాపరాధమే అవుతుందని హెచ్చరించారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. కుప్పం ప్రజలు తిరస్కరించిన తర్వాత చంద్రబాబు మాటలు, హావభావాలు భయంకరంగా ఉన్నాయని, హుందాతనం, సంస్కారం ఆయన మాటల్లో కన్పించట్లేదని అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు, ఆయన పార్టీ పెద్దలు స్వరూపానందేంద్ర స్వామీజీని కలసి ఆశీస్సులు తీసుకున్నారని, ఇప్పుడు స్వామీజీపైనే పరుష వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని సజ్జల తప్పుపట్టారు. చంద్రబాబు అప్పుడు స్వామీజీ దగ్గరకు దేనికెళ్లారు?.. క్షుద్రపూజల కోసమా? దొంగపూజల కోసమా? చెప్పాలని నిలదీశారు. సజ్జల ఇంకా ఏమన్నారంటే..

అసభ్యకరంగా మాట్లాడడం శోచనీయం..
చంద్రబాబు విధానపరమైన విమర్శలు చేస్తే హుందాగా ఉంటుంది. ఈమధ్య కుప్పం నేతలతో టీడీపీ అధినేత జరిపిన టెలీకాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్, మంత్రి పెద్దిరెడ్డిపై పరుష పదజాలంతో, అసభ్యకరంగా మాట్లాడటం శోచనీయం. తనమీద తనే అదుపుతప్పి ఖబడ్దార్‌ అంటూ హెచ్చరించడాన్ని బట్టి చూస్తే ఆయన చిన్న మెదడు చిట్లిపోయిందని భావించాల్సి వస్తోంది. వైఎస్‌ జగన్‌పై దూషణలు చేయడమంటే... ఆకాశంపై ఉమ్మేయడమే. త్వరలో జరిగే పరిషత్‌ ఎన్నికల్లోనూ చంద్రబాబు ఇదేరీతిలో మాట్లాడతారేమో? ప్రజలకు నిజంగా మేలు చేసుంటే ఆయన్నే మళ్లీ ఎన్నుకునేవారు. ఏం చేయలేదనే జనం తరిమికొట్టారు. ఓటమిపై ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన చంద్రబాబు తనకుతాను అతిగా ఊహించుకుంటున్నారు. ఇష్టానుసారం మాట్లాడుతూ ప్రజలకేం సందేశమివ్వాలనుకున్నారో? చంద్రబాబు తీరు గమనిస్తే.. ఆయన ఒంటికే కాదు.. తలకూ రోగం ఉందని తెలుస్తోంది. అడ్డగోలు మాటలు మాట్లాడితే ఓట్లు రావని చంద్రబాబు గుర్తించాలి. వ్యక్తిగత దూషణలపై ఎవరైనా ఆవేశపడితే దానికి ఆయనే బాధ్యత వహించాలి. దుర్గగుడిలో అవినీతిని అరికట్టేందుకు జరుగుతున్న ఏసీబీ దాడులను అభినందించాలి. మంత్రిని నిందించడం సరికాదు. 

అందుకే జమిలి గోల..
చంద్రబాబు, ఆయన కొడుకు జమిలి ఎన్నికలంటూ పదేపదే చెప్పడం విడ్డూరంగా ఉంది. టీడీపీ పతనావస్థకు చేరింది. మూడేళ్లు నడపడం కష్టమని చంద్రబాబు భావిస్తున్నారు. ఆ పార్టీ కేడర్‌ ఇతర పార్టీల్లోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. పంచాయతీ ఎన్నికల్లో రెండేళ్ల వైఎస్‌ జగన్‌ పాలనకు ప్రజలు సానుకూల తీర్పునిచ్చారు. దీంతో ప్రతీ అడుగు ఊబిలోకే అన్న భయం టీడీపీ కేడర్‌కు పట్టుకుంది. దీన్ని కప్పిపుచ్చేందుకే జమిలి ఎన్నికలంటూ తన వాళ్లకు భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది పిచ్చి భ్రమే. విజయవాడ కరకట్ట విస్తరణపై దుష్ప్రచారం దుర్మార్గం. చంద్రబాబు చేసిన అస్తవ్యస్థతను ఈ ప్రభుత్వం సరిచేస్తోందన్నది వాస్తవం.
చదవండి: 43 గుళ్లను కూల్చేసిన ఘనుడు చంద్రబాబు

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు