ఒడిశా దుశ్చర్యపై రాజన్నదొర అసహనం

17 Aug, 2021 13:22 IST|Sakshi

విజయనగరం: ఒడిశా దుశ్చర్యపై సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర అసహనం వ్యక్తం చేశారు. కొటియా గ్రామాల్లో ఒడిశా దూకుడుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆయన తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఫొటో, వీడియో ఆధారాలున్నాయని ఎమ్మెల్యే రాజన్నదొర పేర్కొన్నారు. కొండంగి, సారిక, ధనసరాయి, సంపంగిపాడు, కురుకుట్టి సర్పంచ్‌లకు.. డబ్బు ఆశ చూపి లోబరుచుకుంటున్నారు. ఒడిశా తరచూ కవ్వింపు చర్యలకు దిగుతోందని ఎమ్మెల్యే రాజన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనుల భద్రత కోసమే సంయమనం పాటిస్తున్నామని ఎమ్మెల్యే రాజన్నదొర అన్నారు. (చదవండి: కొటియా గ్రామాలపై ఒడిశా దూకుడు)

కాగా ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని కొటియా గ్రామాలపై ఆ రాష్ట్రం కన్నేసింది. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గ పరిధిలోకి వచ్చే 34 కొటియా గ్రామాలను ఎలాగైనా గుప్పిటపట్టాలని కొత్త ఎత్తుగడలు వేస్తోంది. ఏకంగా ఆంధ్రప్రదేశ్‌ ఆనవాళ్లనే అక్కడ లేకుండా చేయడానికి దూకుడుగా వెళ్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన రోడ్డును పెకలించేసిన ఒడిశా అధికారులు తాజాగా బీటీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. అంతేకాకుండా హడావుడిగా కొన్ని శాశ్వత భవనాలను కూడా నిర్మిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్మాణం తలపెట్టినా అభ్యంతరం చెబుతున్న అటవీ శాఖ అధికారులు.. ఒడిశా చర్యల విషయంలో మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు