రక్షణ రంగంలో రూ.8,431 కోట్ల ఎగుమతులు

29 Sep, 2022 06:00 IST|Sakshi

ఆకాష్, టార్పెడోలు, రాడార్ల ఎగుమతులపై పలు దేశాలతో చర్చలు 

స్టార్టప్‌లకు డీఆర్‌డీవో నుంచి సాంకేతిక బదలాయింపు 

ఇప్పటివరకు 60 పరిశ్రమలకు రూ.250 కోట్లు 

నిరంతర పరిశోధనలకు ప్రోత్సాహం 

‘సాక్షి’తో రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు డాక్టర్‌ సతీష్‌రెడ్డి 

సాక్షి, విశాఖపట్నం: రక్షణ రంగంలో ఆత్మనిర్భర్‌ భారత్‌ అమలు ద్వారా అనేక విప్లవాత్మక మార్పులు వచ్చాయని రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు డాక్టర్‌ సతీష్‌రెడ్డి చెప్పారు. పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బుధవారం విశాఖపట్నం వచ్చిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. మేకిన్‌ ఇండియాలో భాగంగా డీఆర్‌డీవో నుంచి సాంకేతిక బదలాయింపుని ప్రోత్సహించడం ద్వారా రక్షణ సామగ్రి ఉత్పత్తులు పెరిగాయని తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. 

పెరుగుతున్న ఎగుమతులు 
దేశీయ తయారీ రంగానికి ఉత్తేజం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు రక్షణ పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేసింది. మేక్‌ ఇన్‌ ఇండియాలో భాగంగా తయారవుతున్న ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతిచేసే స్థాయికి చేరుకున్నాం. 2014–15 నాటికి రూ.2 వేల కోట్ల కంటే తక్కువలో ఉన్న డిఫెన్స్‌ ఎక్స్‌పోర్ట్స్‌ 2020–21 నాటికి రూ.8,431 కోట్లకు చేరుకోవడం విశేషం. పదుల సంఖ్యలో దేశాలకు ఎగుమతులు జరుగుతుండటం శుభపరిణామం. ప్రస్తుతం 334 శాతం పెరుగుదల ఉన్న ఎగుమతులు భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 

టార్పెడోలు, రాడార్ల ఎగుమతులపై చర్చలు 
పలు దేశాలు మన రక్షణరంగ పరికరాలతో పాటు ఆయుధ సంపత్తిని తీసుకుంటున్నాయి. త్వరలోనే అత్యంత శక్తిమంతమైన ఆయుధాల ఎగుమతులకు కూడా ఒప్పందాలు జరిగే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఆకాష్, టార్పెడోలు, రాడార్లతో పాటు క్షిపణుల ఎగుమతులపై ప్రభుత్వం వివిధ దేశాలతో చర్చిస్తోంది.  

సాంకేతిక బదలాయింపుతో ప్రోత్సాహం 
రక్షణ రంగానికి అవసరమైన ఇన్నోవేషన్స్‌ని సృష్టించే అంకుర పరిశ్రమలు, ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహిస్తున్నాం. డిఫెన్స్‌ ఇన్నోవేషన్‌ స్టార్టప్‌ చాలెంజ్‌ ద్వారా సాంకేతికత బదలాయింపు జరుగుతోంది. ఇప్పటికే డీఆర్‌డీవో నుంచి 60 పరిశ్రమలకు దాదాపు రూ.250 కోట్లకుపైగా టెక్నాలజీ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ అందించాం. డిఫెన్స్‌ రంగం వైపు ఎక్కువ స్టార్టప్స్‌ అడుగులు వేస్తున్నాయి.

పరిశోధనల అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ)లోను  మార్పులు వస్తున్నాయి. క్వాంటం, హైపవర్‌ లేజర్, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజన్స్‌.. ఇలా ఎన్నో పరిశోధనలు వస్తున్నాయి. వీటిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్‌ అండ్‌ డీ బడ్జెట్‌లో 25 శాతం వరకు పరిశ్రమలు, స్టార్టప్స్, విద్యారంగానికి కేటాయించడం చరిత్రాత్మకమైన నిర్ణయం. 

ఏఐపీ ప్రయోగాలు విజయవంతమవుతున్నాయి 
డీఆర్‌డీవోకి చెందిన నేవల్‌ మెటీరియల్స్‌ రీసెర్చ్‌ ల్యాబొరేటరీ (ఎన్‌ఎంఆర్‌ఎల్‌)లో అభివృద్ధి చేసిన ఇంధన ఆధారిత ఎయిర్‌ ఇండిపెండెంట్‌ ప్రొపల్షన్‌(ఏఐపీ) ల్యాండ్‌ బేస్డ్‌ 
ప్రోటోటైప్‌ ప్రయోగాలు విజయవంతమయ్యాయి. త్వరలో ఇంటిగ్రేషన్‌ చేయాలి. ఇతర సాంకేతికతలతో పోల్చిచూస్తే ఫ్యూయల్‌ బేస్డ్‌ ఏఐపీ సబ్‌మెరైన్లకు ఎంతో ఉపయోగపడుతుంది.  

శారదాపీఠంలో సతీష్‌రెడ్డి పూజలు 
సింహాచలం: విశాఖపట్నం చినముషిడివాడలోని శ్రీ శారదాపీఠాన్ని బుధవారం కేంద్ర రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు సతీష్‌రెడ్డి దర్శించుకున్నారు. పీఠంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారు. శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారికి పూజలు చేశారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతి ఆశీస్సులు అందుకున్నారు. 

మరిన్ని వార్తలు