రోజుకి 9 గంటలపైనే పని 

2 Mar, 2022 05:28 IST|Sakshi

64 శాతం ఉద్యోగుల్లో తీవ్ర ఒత్తిడి  

గోద్రెజ్‌ ఇంటీరియో వర్క్‌ప్లేస్‌ సర్వేలో వెల్లడి 

సాక్షి, అమరావతి: పని ప్రదేశాల్లో 64% మంది ఉద్యోగులు రోజుకు 9 గంటలకు పైగా ఒకే భంగిమలో కూర్చుంటూ పనిభారాన్ని మోస్తున్నారని గోద్రెజ్‌ ఇంటీరియో వర్క్‌ప్లేస్‌ సర్వే తెలిపింది. పని ప్రదేశాల్లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సవాళ్లపై గోద్రెజ్‌ ఇంటీరియో వర్క్‌ప్లేస్, ఎర్గోనామిక్స్‌ రీసెర్చ్‌ సెల్‌ ‘ఇట్స్‌ టైమ్‌ టు స్విచ్‌’ పేరుతో తాజాగా ఓ అధ్యయనం చేసింది. గంటల కొద్దీ ఒకే భంగిమలో పనిచేస్తుండటంతో అనారోగ్య సమస్యలు వస్తున్నట్లు గుర్తించింది. వర్క్‌ డెస్క్‌లు, సమావేశాల్లో ఎక్కువ గంటలు కూర్చోవడం లేదా నిల్చుని ఉండటంతో కండరాలపై తీవ్ర ప్రభావం పడి త్వరగా అలసిపోతున్నారని పేర్కొంది.

నిరంతరం ఒకే భంగిమలో కాకుండా కాసేపు కూర్చోవడం, కొద్ది సేపు నిల్చోవడంతో శరీరంపై ఒత్తిడి తగ్గుతుందని సూచించింది. ఈ విధానం ద్వారా బాగా పనిచేస్తూ..శరీరాన్ని రోజంతా చురుగ్గా ఉంచుకోవచ్చని తెలిపింది. పనిలో ఎక్కువ గంటలు కూర్చోవడం వల్ల కలిగే సమస్యలను పరిష్కరించడానికి ఉద్యోగులు అనుసరించిన పద్ధతులను తెలుసుకోవడానికిగాను దేశవ్యాప్తంగా 500 మంది నుంచి వివరాలను సంస్థ తీసుకుంది. ఎక్కువ సేపు కూర్చుని పని చేయడం నుంచి ఉపశమనానికి ఏం చేయాలని ప్రశ్నించగా..73% మంది తమకు తెలియదని సమాధానమిచ్చారు.

మరో 27% మంది ప్రత్యామ్నాయంగా నిల్చోవడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. అయితే, ఎక్కువసేపు నిల్చుని పనిచేయడం కూడా ప్రమాదమేనని సర్వే హెచ్చరించింది. ఈ అవరోధాలను అధిగమించేందుకు కార్యాలయాల్లో సాంకేతిక సామర్థ్యంతో పాటు ఉత్పాదకతను పెంచడానికి సహాయపడే సరైన మౌలిక సదుపాయాలను కల్పించాలని పేర్కొంది. కరోనా మహమ్మారితో పనిచేసే విధానంలో సాంకేతికత జోడింపుతో చాలా మార్పులు వచ్చాయని, అయితే అధిక శాతం మంది ఉద్యోగులు పాత విధానంలోనే సీటుకు అతుక్కుపోయి పనిచేస్తున్నారని వివరించింది. ముఖ్యంగా కార్యాలయాల్లో కూర్చునే పద్ధతుల్లో మార్పులు తీసుకురావాలని అభిప్రాయపడింది.   

మరిన్ని వార్తలు