‘వండర్‌’ వరలక్ష్మి.. సాఫ్ట్‌బాల్‌ క్రీడలో సత్తా చాటుతున్న సిక్కోలు విద్యార్థిని

28 Nov, 2022 05:22 IST|Sakshi

ఏసియన్‌ యూనివర్సిటీ మహిళల సాఫ్ట్‌బాల్‌ పోటీలకు ఎంపిక

డిసెంబర్‌ 17 నుంచి 21 వరకు బ్యాంకాక్‌లో పోటీలు

శ్రీకాకుళం న్యూకాలనీ: సిక్కోలు విద్యార్థిని కూటికుప్పల వరలక్ష్మి సాఫ్ట్‌బాల్‌లో అంచలంచెలుగా ఎదుగుతూ సంచలనాలు సృష్టిస్తోంది. రాష్ట్ర, జాతీయస్థాయిలో పతకాలు సాధిస్తూ సత్తా చాటుతోంది. తాజాగా ఏసియన్‌ యూనివర్సిటీ మహిళల(సీనియర్స్‌) సాఫ్ట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌–2022 పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకుంది. ఈ పోటీలు డిసెంబర్‌ 17 నుంచి 21 వరకు బ్యాంకాక్‌లో జరగనున్నాయి. త్వరలో భారత జట్టు సభ్యులతో కలిసి ఆమె శిక్షణ తీసుకోనుంది.  


కొత్తవలస నుంచి బ్యాంకాక్‌కు.. 

వరలక్ష్మి స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలోని కొత్తవలస. ఆమె తల్లిదండ్రులు కూటికుప్పల రాజు, భారతి దినసరి కూలీలు. పనికి వెళ్తే తప్ప పూట గడవని పరిస్థితి. తొగరాంలోని జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో 6వ తరగతి చదువుతున్న సమయంలో వరలక్ష్మి సాఫ్ట్‌బాల్‌ క్రీడపై ఆసక్తి కనబరిచింది.  అక్కడి ఫిజికల్‌ డైరెక్టర్‌ మొజ్జాడ వెంకటరమణ ఆమెకు సాఫ్ట్‌బాల్‌ క్రీడలో శిక్షణ ఇచ్చి ప్రోత్సహించారు. దీంతో ఆమె జిల్లా స్థాయి ఎంపికల్లో ప్రతిభ కనబరిచి.. రాష్ట్రస్థాయికి ఎంపికైంది.


సాఫ్ట్‌బాల్‌ క్రీడలో పిక్చర్‌(బౌలింగ్‌) చేయడంలో వరలక్ష్మి దిట్ట. 2012లో అనంతపురంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో మొదటిసారి పాల్గొన్న వరలక్ష్మి తన అద్భుత ఆటతీరుతో.. జాతీయ పోటీలకు ఎంపికైంది. అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు. తాను పాల్గొన్న ప్రతి పోటీలోను రాణించింది. 2019–20లో రాజస్తాన్‌లో జరిగిన సౌత్‌జోన్‌ సీనియర్‌ నేషనల్స్‌ సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో వరలక్ష్మి ప్రాతినిథ్యం వహించిన ఆంధ్రప్రదేశ్‌ జట్టు రజత పతకం సాధించింది.


ఈ ఏడాది సెప్టెంబర్‌లో యానాంలో జరిగిన ఆసియా కప్‌ సెలెక్షన్స్‌లో కూడా పాల్గొని ప్రతిభ కనబరిచి ప్రాబబుల్స్‌లో చోటు దక్కించుకుంది. వీరికి మధ్యప్రదేశ్‌లో శిక్షణా శిబిరం నిర్వహించగా.. వరలక్ష్మి సత్తా చాటి బ్యాంకాక్‌లో జరిగే ఏసియన్‌ యూనివర్సిటీ మహిళల సాఫ్ట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ పోటీలో పాల్గొనే భారత జట్టుకు ఎంపికయ్యింది. వరలక్ష్మి మరోవైపు చదువులోనూ ప్రతిభ కనబరుస్తోంది.


తొగరాం ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలోనే ఇంటర్‌ పూర్తిచేసిన ఆమె.. వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరులోని రాయలసీమ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ప్రభుత్వ కాలేజీలో డిప్లమో ఇన్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ పూర్తి చేసింది. ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ప్రతిభకు పేదరికం ఏ మాత్రం అడ్డుకాదని వరలక్ష్మి నిరూపిస్తోందని గ్రామస్తులు, పలువురు ప్రముఖులు ప్రశంసించారు. 


తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే.. 

మాది నిరుపేద కుటుంబం. మా అమ్మ, నాన్న కూలి పనులకు వెళ్తుంటారు. మా అమ్మా, నాన్నతో పాటు మా గురువు, పీడీ వెంకటరమణ ప్రోత్సాహం వల్లే నేను ఆటలో ముందుకెళ్లా. సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు కూడా నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించారు. జాతీయ సీనియర్‌ జట్టుకు ఎంపిక కావడమే నా లక్ష్యం. 
– కూటికుప్పల వరలక్ష్మి, సాఫ్ట్‌బాల్‌ క్రీడాకారిణి 

మరిన్ని వార్తలు