రైతులకు మరో రూ.1,300 కోట్లు 

5 Oct, 2020 04:44 IST|Sakshi

విపత్కర పరిస్థితిలో ఇచ్చే రుణం అన్నదాతలకూ వర్తింపు

8 శాతం వడ్డీతో ఏడాదిలోపు రుణం చెల్లించాలి

రాష్ట్రంలోని 2,030 సహకార సంఘాల్లో అమలు

సాక్షి, అమరావతి: కోవిడ్‌–19 నేపథ్యంలో సహకార బ్యాంకులు, సంఘాలు రైతులకు స్పెషల్‌ లిక్విడిటీ ఫెసిలిటీ (వినిమయ) సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చాయి. వాణిజ్య బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు రిజర్వు బ్యాంకు ఈ సౌకర్యాన్ని కల్పించిన విషయం విదితమే. విపత్కర పరిస్థితుల్లో ఉత్పాదకత, క్రయవిక్రయాలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు రిజర్వు బ్యాంకు వాణిజ్య బ్యాంకులు, పరిశ్రమలకు ఈ సౌకర్యాన్ని ఆరునెలల కిందటే అందుబాటులోకి తీసుకువచ్చింది. రిజర్వు బ్యాంకు ఈ సౌకర్యాన్ని సహకార బ్యాంకులకు విస్తరించడంతో సహకార సంఘాలు రైతులకు స్పెషల్‌ లిక్విడిటీ ఫెసిలిటీ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. ఖరీఫ్‌ ప్రారంభంలో రైతులకు మొత్తం సాగు ఖర్చులకు వారు ఇచ్చిన పొలం పత్రాల ఆధారంగా రుణాలు మంజూరు చేశారు.

కోవిడ్‌–19 నేపథ్యంలో ఖర్చులు పెరిగే అవకాశం ఉండటంతో గతంలో ఇచ్చిన రుణం కాకుండా అదనంగా మరికొంత రుణవసతి కల్పిస్తున్నాయి. సకాలంలో రుణాలు చెల్లించిన ట్రాక్‌ రికార్డు కలిగిన రైతులు, బ్యాంకులో రుణాన్ని ఆధారంగా చేసుకుని ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. 8 శాతం వడ్డీ రేటుతో ఏడాదికాలంలో రుణం చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం వరి కోతకు వచ్చిన సమయం కావడంతో రైతుకు ఖర్చులకు, ఇతర పంటల రైతులకు వాటి పరిస్థితులకు అనుగుణంగా ఈ సౌకర్యాన్ని తీసుకువచ్చారు. ఈ తరహా రుణం గతంలో ఎప్పుడూ ఇవ్వకపోవడంతో రైతులకు అవగాహన కలిగించేందుకు సహకార బ్యాంకులు విస్త్రతంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ రుణాలు ఇవ్వడానికి రాష్ట్రంలో 2,030 ప్రాథమిక సహకార సంఘాలు, బ్యాంకులకు ఆప్కాబ్‌ రూ.1,300 కోట్లు కేటాయించింది. సంఘాలు తమ పరిధిలోని రైతుల అవసరాలు, వారి ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఈ రుణాలను ఇస్తున్నాయని ఆప్కాబ్‌ అధికారులు తెలిపారు.  

మరిన్ని వార్తలు