కొల్లేరు అంబాసిడర్‌గా గూడకొంగ

7 Oct, 2021 03:42 IST|Sakshi

ప్రకటించిన రాష్ట్ర అటవీ శాఖ  

సాక్షి, అమరావతి: కొల్లేరు అంబాసిడర్‌గా గూడకొంగ(స్పాట్‌ బిల్డ్‌ పెలికాన్‌)ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని రాష్ట్ర అటవీ దళాధిపతి ఎన్‌.ప్రతీప్‌కుమార్‌ బుధవారం వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ఐకానిక్‌ వీక్‌ కార్యక్రమంలో భాగంగా ఈ పక్షిని అంబాసిడర్‌గా గుర్తించినట్లు చెప్పారు. గుంటూరులోని అటవీ శాఖ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో బుధవారం దీనికి సంబంధించిన పోస్టర్, లోగోను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ వారం దేశవ్యాప్తంగా చిత్తడి నేలల పరిరక్షణ కోసం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ప్రతి రాష్ట్రంలో చిత్తడి నేలలకు సంబంధించిన ఒక పక్షి లేదా అక్కడి వైవిధ్యమైన జంతువును అంబాసిడర్‌గా ఎంపిక చేయాల్సి ఉందన్నారు. ఏపీలో గూడకొంగను ఎంపిక చేసినట్లు తెలిపారు. 

ప్రపంచంలో ఉన్న పెలికాన్‌ పక్షుల్లో 40 శాతం ప్రతి ఏడాదీ కొల్లేరుకు వస్తాయని, అందుకే దీన్ని అంబాసిడర్‌గా ఎంపిక చేశామన్నారు. చిత్తడి నేలల పరిరక్షణ కోసం వెట్‌ ల్యాండ్‌ మిత్రాస్‌ను నియమిస్తామని తెలిపారు. స్థానికంగా సేవా దృక్పథం ఉన్నవారిని ఇందుకు ఎంపిక చేస్తామన్నారు. కార్యక్రమంలో డీఎఫ్‌ఓ సెల్వం తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు