నూజివీడు ట్రిపుల్‌ఐటీలో విద్యార్థి ఆత్మహత్య 

4 Mar, 2022 04:42 IST|Sakshi
రామూనాయుడు (ఫైల్‌)

మృతుడి స్వస్థలం విజయనగరం జిల్లా దమరసింగి 

నూజివీడు: నూజివీడు ట్రిపుల్‌ఐటీ విద్యార్థి మండల రామూనాయుడు (16) గురువారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విజయనగరం జిల్లా గుర్ల మండలం దమరసింగికి చెందిన రామానాయుడు పీయూసీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. క్యాంపస్‌లోని ఐ2 హాస్టల్‌లో ఉంటున్నాడు. గురువారం ఉదయం తరగతులకు వెళ్లడంతో పాటు మధ్యాహ్నం మెస్‌కు వెళ్లి భోజనం చేశాడు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో సెక్యూరిటీ సిబ్బంది ఈనెల 4న ట్రిపుల్‌ఐటీకి రానున్న ఇంజనీరింగ్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల కోసం మూడో ఫ్లోర్‌లోని గదుల్ని సిద్ధం చేస్తున్నారు.

ఆ సమయంలో వారు గదిలో ఉరికి వేలాడుతున్న రామూనాయుడిని గుర్తించారు. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే రామూనాయుడు మృతి చెందాడు. గతనెల 25నే ట్రిపుల్‌ ఐటీకి వచ్చిన అతడు ఇంతలోనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మృతుడి తల్లి గతంలోనే మరణించగా తండ్రి, అక్క ఉన్నారు. వీరికి దూరంగా ఉండాల్సి వస్తోందనే వేదనతోనే బలవన్మరణానికి పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. ఈ కారణంతోనే గతనెల 13నే కాలేజీకి రావాల్సిన అతడు 25న వచ్చినట్లు ట్రిపుల్‌ఐటీ వర్గాలు తెలిపాయి.  

మరిన్ని వార్తలు