అమ్మలా ఆలోచించారు

6 Oct, 2021 03:31 IST|Sakshi

పేద బాలికలకు ‘స్వేచ్ఛ’ ఎంతో ప్రయోజనం

మహిళల ఆరోగ్యంపై సీఎం జగన్‌ ప్రత్యేక శ్రద్ధ  

మంత్రి తానేటి వనిత

సాక్షి, అమరావతి: పిల్లల ఆరోగ్యం పట్ల ఒక తల్లి ఎంత శ్రద్ధ తీసుకుంటుందో ముఖ్యమంత్రి జగన్‌ ఓ మేనమామగా అంతకుమించి ఆలోచిస్తున్నారని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. కిశోర బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్స్‌ అందచేసే కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషకరమని, దీనివల్ల పేద కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఇన్‌ఫెక్షన్ల బారినపడ్డ పిల్లలు తమ సమస్యను ఎవరితోనూ చెప్పుకోలేక మానసిక ఆందోళనకు గురవడం వల్ల చదువులపై ప్రభావం పడుతుందన్నారు. మంగళవారం ‘స్వేచ్ఛ’ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా మంత్రి వనిత మాట్లాడారు. 

రెండు నెలలకు సరిపడా స్కూళ్లకు స్టాక్‌ 
‘గతంలో స్కూళ్లలో టాయిలెట్స్‌ కూడా ఉండేవి కాదు. ఇప్పుడు నాడు– నేడు ద్వారా రన్నింగ్‌ వాటర్‌తో టాయిలెట్స్‌ సదుపాయం కల్పించడం వల్ల పిల్లలు నిశ్చింతగా పాఠశాలలకు వస్తున్నారు. విద్య, ఆరోగ్య, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సమన్వయంతో నిర్వహించే స్వేచ్ఛ కార్యక్రమం ద్వారా 10 లక్షల మంది విద్యార్ధులకు న్యాప్‌కిన్స్‌ అందచేస్తాం. ప్రతీ స్కూల్‌లో నోడల్‌ ఆఫీసర్‌ దీనిని పర్యవేక్షిస్తారు. దీంతోపాటు వైఎస్సార్‌ చేయూత స్టోర్స్‌ ద్వారా కూడా తక్కువ ధరకే బ్రాండెడ్‌ న్యాప్‌కిన్స్‌ అందుబాటులో ఉంచుతున్నాం.

ప్రాక్టర్‌ అండ్‌ గ్యాంబుల్, నైన్‌ కంపెనీల నుంచి కొనుగోలు చేస్తున్నాం. అక్టోబర్, నవంబర్‌ నెలలకు సరిపడా స్టాక్‌ ఇప్పటికే స్కూళ్లకు పంపించాం. ముఖ్యమంత్రి జగన్‌ మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ ద్వారా ఏడాదికి రూ.1,800 కోట్లు కేటాయిస్తున్నారు.  రుచికరమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. దిశ యాప్‌ తెచ్చి మహిళలకు చక్కటి వరాన్ని ఇచ్చారు. మీరు తీసుకుంటున్న ప్రతీ నిర్ణయం వల్ల ఎంతోమంది పేద కుటుంబాల్లో వారి తల్లిదండ్రులు ఇవ్వలేనివి పిల్లలకు అందుతున్నాయి’ అని మంత్రి వనిత పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు