మరోసారి అలజడికి టీడీపీ నేతల యత్నం

9 Jan, 2023 08:33 IST|Sakshi

మాచర్ల: కండీషన్‌ బెయిల్‌ పేరుతో టీడీపీ నేతలు మాచర్లలో అలజడి సృష్టించేందుకు మరోమారు విఫలయత్నం చేశారు. గత నెల 16వ తేదీన ‘ఇదేం ఖర్మ’ కార్యక్రమం పేరుతో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి 12వ వార్డులో ర్యాలీగా వెళ్తూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులు చేసి ముగ్గురిపై హత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధితుల ఫిర్యాదు మేరకు బ్రహ్మారెడ్డి మరో 23 మందిపై కేసు నమోదైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ తీసుకున్న నిందితులందరూ కండీషన్‌ బెయిల్‌కు సంబంధించి పట్టణ పోలీసు స్టేషన్‌లో సంతకాలు చేయాలని హైకోర్టు ఉత్తర్వులిచ్చింది.

ఆదివారం సంతకాలు చేసేందుకు బ్రహ్మారెడ్డి, టీడీపీ నాయకులు వస్తున్న నేపథ్యంలో అలజడి సృష్టించాలని వ్యూహం పన్నారు. ఇందులో భాగంగా మాచర్లకు తరలి రావాలంటూ వారి అనుచర వర్గానికి సమాచారం ఇచ్చారు. ఈ విషయాన్ని పసిగట్టిన పోలీసులు నిఘాను కట్టుదిట్టం చేశారు. పోలీసు 30 యాక్టు, 144 సెక్షన్‌ అమలు చేస్తూ నెహ్రూనగర్‌ నుంచి పట్టణ పోలీసు స్టేషన్‌ వరకు గురజాల డీఎస్పీ మెహర్‌ జయరాం ప్రసాద్, సీఐ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. దీంతో ఇతరులు అక్కడికి వచ్చి అలజడి సృష్టించే అవకాశం లేకపోయింది. కేవలం బ్రహ్మారెడ్డి, ఆయన అనుచరులు మాత్రమే 12.30 గంటలకు బస్సులోంచి చేతులూపుతూ వచ్చి సంతకాలు చేసి వెళ్లారు.

ఇదీ చదవండి: గుంటూరు: డిగ్రీలు లేని పరిశోధకుడు.. 500 అదృశ్య గ్రామాలను గుర్తించి.. 

మరిన్ని వార్తలు