ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూత

3 Mar, 2023 07:26 IST|Sakshi

గన్నవరం/సాక్షి, అమరావతి: ఎమ్మెల్సీ, టీడీపీ కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బచ్చుల అర్జునుడు (65) గురువారం కన్నుమూశారు. ఆయన జనవరి 28వ తేదీ తెల్లవారుజామున తీవ్ర గుండెపోటుకు గురికాగా విజయవాడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి కోమాలో ఉన్న అర్జునుడి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మచిలీపట్నానికి చెందిన బచ్చుల అర్జునుడు టీడీపీలో ఉమ్మడి కృష్ణాజిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా, రెండున్నరేళ్లుగా టీడీపీ గన్నవరం ఇన్‌చార్జ్‌గా కొనసాగుతున్నారు. ఆయన ఎమ్మెల్సీ పదవీకాలం ఈ నెల 25వ తేదీన ముగియనుంది. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

నివాళులర్పించిన చంద్రబాబు
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు పార్థివదేహాన్ని గురువారం రాత్రి గన్నవరంలోని టీడీపీ కార్యాలయానికి తీసుకొచ్చారు. అర్జునుడు పార్థివదేహానికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ జెండా కప్పి నివాళులర్పించారు. అర్జునుడు మృతికి సంతాపం తెలిపారు. అనంతరం బచ్చుల కుటుంబసభ్యులను పరామర్శించారు. అర్జునుడు మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. ఎంపీ కేశినేని నాని, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు.. అర్జునుడి భౌతికకాయానికి నివాళులర్పించారు. 

గవర్నర్‌ సంతాపం
ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మృతిపట్ల గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈమేరకు ఆయన ట్వీట్‌ చేశారు. బచ్చుల కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు.

మరిన్ని వార్తలు