ప్రధానితో సమావేశానికి ఏపీ నుంచి ముగ్గురు..

21 May, 2022 08:06 IST|Sakshi

ఈ నెల 31న పథకాల లబ్ధిదారులతో ప్రధాని మోదీ మాటా మంతీ

సీఎస్‌లతో కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్‌

సాక్షి, అమరావతి: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా ఈనెల 31న రాష్ట్రం నుంచి మూడు జిల్లాలకు చెందిన ముగ్గురు ప్రతినిధులు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమవనున్నారు. దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న వివిధ పథకాల లబ్ధిదారులతో ప్రధాని హిమాచల్‌ ప్రదేశ్‌ రాజధాని సిమ్లా నుంచి నేరుగా మాట్లాడనున్నారు. ఇందుకు సంబంధించి దేశవ్యాప్తంగా చేయాల్సిన ఏర్పాట్లపై శుక్రవారం ఢిల్లీ నుంచి కేంద్ర  కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబ వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో (సీఎస్‌లతో) వీడియో సమావేశం నిర్వహించారు.
చదవండి: చంద్రబాబు పొంతనలేని వ్యాఖ్యలు.. అవాక్కయిన టీడీపీ కార్యకర్తలు

సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ మాట్లాడుతూ విజయనగరం, కృష్ణా, చిత్తూరు జిల్లాల నుంచి ముగ్గురు లబ్ధిదారులను ప్రధానితో సమావేశానికి ఎంపిక చేస్తామని చెప్పారు. పీఎం ఆవాస్‌ యోజన, పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి, పీఎం ఉజ్వల యోజన, పోషణ్‌ అభియాన్, పీఎం మాతృ వందన తదితర అన్ని పథకాలపై లబ్ధిదారులతో ప్రధాని నేరుగా మాట్లాడతారని రాజీవ్‌ గౌబ చెప్పారు.

అన్ని పథకాలు లబ్ధిదారులకు చేరడం, పథకాలను మరింత సమర్ధవంతంగా అమలు చేయడం ద్వారా ప్రజల జీవన విధానాన్ని మెరుగుపర్చడంపై సూచనలు, సలహాలు తీసుకుంటారని తెలిపారు. జిల్లా స్థాయి కార్యక్రమాల్లో కేంద్ర రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, స్వాతంత్య్ర సమరయోధులు, వారి కుటుంబ సభ్యులు, ప్రతి పథకానికి కనీసం 10 మంది లబ్ధిదారులు, జిల్లా ప్రముఖులు, బ్యాంకులు, పౌర సంఘాల ప్రతినిధులు సహా కనీసం 500 మందిని భాగస్వాములను చేయాలని సూచించారు. జిల్లా స్థాయి కార్యక్రమాల నిర్వహణకు సహాయ సహకారాలు అందించాలని, పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయిలో ఒక నోడల్‌ అధికారిని నియమించాలని ఆదేశించారు.  

మరిన్ని వార్తలు