ఐదు రోడ్లు.. రెండు ఆర్వోబీలు.. ఓ వంతెన

22 Dec, 2021 05:05 IST|Sakshi

ప్రయాణం.. మరింత సౌలభ్యం

రూ.1,048.50కోట్లతో నిర్మాణాలకు టెండర్లు

చిత్తూరు జిల్లా పీలేరు సమీపంలో రెండు రోడ్డు ఓవర్‌ బ్రిడ్జ్‌లు

రూ.100 కోట్ల అంచనా వ్యయంతో పెన్నా నదిపై కొత్త వంతెన 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రోడ్డు రవాణా మౌలిక సదుపాయాలు మెరుగుపరిచే కార్యాచరణ ఊపందుకుంది. 2021–22 వార్షిక ప్రణాళికలో పనులను ఆర్‌అండ్‌బీ శాఖలోని జాతీయరహదారుల విభాగం వేగవంతం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనల మేరకు కేంద్రం గతంలో ఎన్నడూలేని రీతిలో ఆమోదించిన రూ.6,421కోట్ల వార్షిక ప్రణాళికలో పేర్కొన్న రోడ్ల నిర్మాణానికి కార్యాచరణ సిద్ధమయ్యింది. అందులో భాగంగా రూ.1,048.50 కోట్లతో ఐదు రోడ్లు, రెండు ఆర్వోబీలు, పెన్నా నదిపై ఓ వంతెన నిర్మాణానికి ఆర్‌అండ్‌బీ శాఖ టెండర్లు పిలిచింది. ఆ పనుల వివరాలిలా ఉన్నాయి. 

► చిత్తూరు జిల్లా పీలేరు సమీపంలో రెండు రోడ్డు ఓవర్‌ బ్రిడ్జ్‌ (ఆర్వోబీ)లు రూ.140కోట్లతో నిర్మిస్తారు. జాతీయ రహదారి–40 వద్ద, జాతీయ రహదారి–71 వద్ద ఒక్కోటి రూ.70కోట్లతో నిర్మిస్తారు.
► రూ.100 కోట్ల అంచనా వ్యయంతో నెల్లూరు సమీపంలోని జాతీయ రహదారి–67 మార్గంలో  పెన్నా నదిపై కొత్త వంతెన నిర్మిస్తారు.  ప్రస్తుతం పెన్నా నదిపై ఉన్న వంతెన 6.70మీటర్ల వెడల్పే ఉంది. దీంతో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి పెన్నా నదిపై 2.68 కి.మీ. మేర కొత్త వంతెన నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  
► తెలంగాణ సరిహద్దులోని ముదిరెడ్డిపల్లె నుంచి నెల్లూరు రహదారిలో భాగంగా 43 కి.మీ. మేర రెండు లేన్ల రోడ్డును పావ్డ్‌ సోల్డర్స్‌ (10 మీటర్ల వెడల్పు) అభివృద్ధి చేస్తారు. వైఎస్సార్‌ కడప జిల్లా సరిహద్దు నుంచి నెల్లూరు జిల్లా సరిహద్దు వరకు రూ.300కోట్లతో రహదారి నిర్మిస్తారు. రోజుకు 4,500 వరకు పాసింజర్‌ కార్‌ యూనిట్ల ట్రాఫిక్‌ రద్దీ ఉన్న ఈ రహదారిని అభివృద్ధి చేయడంతో ప్రయాణం మరింత సౌలభ్యంగా మారుతుంది.  
► రూ.318.50 కోట్ల అంచనా వ్యయంతో జాతీయ రహదారి 167బి మార్గంలో సీఎస్‌ పురం నుంచి మాలకొండ వరకు రెండు లేన్ల రోడ్డును పావ్డ్‌ సోల్డర్స్‌ (10 మీటర్ల వెడల్పు)తో అభివృద్ధి చేస్తారు. 44 కి.మీ.రహదారి నిర్మాణం వల్ల  రోజుకు 6,900 పాసింజర్‌ కార్‌ యూనిట్ల ట్రాఫిక్‌ రద్దీ ఉండే ఈ మార్గంలో రాకపోకలు మరింత సౌలభ్యంగా మారతాయి.  
► రూ.90కోట్ల అంచనా వ్యయంతో చిత్తూరు నగర పరిధిలో జాతీయ రహదారి–40, జాతీయ రహదారి–69ని అనుసంధానిస్తూ నాలుగు లేన్ల రహదారి నిర్మించాలని నిర్ణయించారు. 6.80కి.మీ. మేర ఈ రహదారిపై రోజుకు12,500 పాసింజర్‌ కార్‌ యూనిట్ల ట్రాఫిక్‌ రద్దీ ఉంటుంది. ఆ నాలుగు లేన్ల రహదారితో మన రాష్ట్రం నుంచి అటు చెన్నై ఇటు బెంగళూరుకు రాకపోకలకు సౌలభ్యంగా ఉంటుంది. 
► చిత్తూరు జిల్లాలోని పుత్తూరు నుంచి ఉత్తుకొట్టై వరకు రహదారిని అభివృద్ధి చేస్తారు.   40 కి.మీ. మేర ఈ రహదారి పనుల కోసం రూ.50కోట్లు కేటాయించారు.  
► రూ.50కోట్ల అంచనా వ్యయంతో  చిలమత్తూరు–హిందూపూర్‌–పరిగి మార్గంలో 23.20 కి.మీ. మేర రెండు లేన్ల రోడ్డును పావ్డ్‌ సోల్డర్స్‌ (10 మీటర్ల వెడల్పు) విధానంలో అభివృద్ధి చేస్తారు.   

మరిన్ని వార్తలు