మూగబోయిన బహుజన గళం

26 Jul, 2020 05:57 IST|Sakshi

కరోనాతో దళిత, బహుజన ఉద్యమ మేధావి ఉ.సా. కన్నుమూత 

దళిత, బహుజనుల కోసం ఆయనది అలుపెరగని పోరాటం 

హైదరాబాద్‌: అణగారిన వర్గాల ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసిన దళిత, బహుజన, ఉద్యమ మేధావి ఉ.సా. (ఉప్పుటూరి సాంబశివరావు) కరోనా కాటుకు బలయ్యారు. ఆయన వయస్సు 70 సంవత్సరాలు. ఆయన మలక్‌పేటలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. ఆయనకు వారం క్రితం విరేచనాలయ్యాయి. ఎంతకూ తగ్గకపోవడంతో పరీక్షలు నిర్వహించగా, కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది. దీంతో ఆయనను శుక్రవారం రాత్రి బర్కత్‌పురలోని ఓ ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతిచెందారు. అదే రోజు అంబర్‌పేట శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన భార్య పద్మావతి ప్రసూనాంబ గతంలోనే మృతిచెందారు. కుమార్తె హిమబిందు ఢిల్లీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. 

అలుపెరగని పోరాటయోధుడు 
► గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా బ్రాహ్మణ కోడూరులో పుట్టిన ఉ.సా. ప్రజాతంత్ర విద్యార్థి సంఘం (డీఎస్‌వో), యూసీసీఆర్‌ఐ (ఎంఎల్‌) పార్టీలో  పనిచేశారు. ఆ పార్టీ నాయకులు దేవులపల్లి, తరిమెల నాగిరెడ్డితో సాన్నిహిత్యం పెంచుకున్నారు.  
► తూ.గో. జిల్లా దేవీపట్నం ప్రాంతంలో గిరిజన హక్కుల కోసం పోరాడారు. ఈ క్రమంలో పార్టీలో మహిళా విభాగంలో పనిచేస్తున్న పద్మావతిని కులాంతర వివాహం చేసుకున్నారు. 
► గోదావరి జలాలను నల్లగొండ జిల్లాకు తీసుకు రావాలని కోరుతూ జరిగిన పోరాటంలో, అమరావతి ప్రాంతంలోని పొన్నెకల్లులో రైతాంగ సమస్యలపైన జరిగిన పోరాటాల్లో పాల్గొన్నారు. 
►మోత్కూర్‌లో విద్యుత్‌ అంతరాయంతో కాలిపోయిన మోటార్లను వేలాది ఎడ్లబండ్లపై పెట్టుకొని ఉ.సా. ఆధ్వర్యంలో నిర్వహించిన ఎడ్లబండ్ల ర్యాలీ చిరస్థాయిగా నిలిచిపోతుంది. 
► కారంచేడు, చుండూరు దళిత ఉద్యమాల్లో చురుకైనపాత్ర పోషించారు. ఎమర్జెన్సీ కాలంలో జైలు జీవితం గడిపారు. 
► మహబూబ్‌నగర్‌లో ఆకలిచావులకు చలించి తన తోటి మేధావులతో కలిసి భోజన కేంద్రాలను నాలుగేళ్ల పాటు నాలుగు గ్రామాల్లో నిర్వహించారు.  
► జోలాలి పాడాలి అనే పాటను, కరువుపై అనేక పాటలను, పుస్తకాలను, బుర్రకథను, పోచంపాడు కుంభకోణంపై ఓ పుస్తకాన్ని, నల్లగొండ వరదకాలువ అనే మరో పుస్తకాన్ని రచించారు.  
► అనంతరం పార్టీ నుంచి దూరమై అంబేడ్కర్, పూలే ఆలోచనా విధానాలతో బహుజనుల కోసం పనిచేశారు. కంచె ఐలయ్యతో కలిసి నలుపు పత్రికను, ఆ తరువాత ఎదురీత పత్రికను నడిపారు.   

మరిన్ని వార్తలు