కరోనా టీకాపై చైతన్యం కలిగించాలి

2 Nov, 2021 04:10 IST|Sakshi
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

దేశంలో ఇంకా చాలామంది వ్యాక్సిన్‌ వేయించుకోలేదు 

ప్రజలను జాగృతపర్చాల్సిన బాధ్యత వైద్యులపై ఉంది 

‘టెలిమెడిసిన్‌’ సేవలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలి 

గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించడాన్ని తప్పనిసరి చేయాలి 

మానవీయ కోణంలో వైద్యులు చికిత్స చేయాలి 

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

సాక్షి, అమరావతి/చిన్న అవుటపల్లి (గన్నవరం రూరల్‌): దేశంలో ఇప్పటికీ కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు చాలామంది ముందుకు రావడంలేదని, వైద్యులు ఈ విషయంలో ప్రజలకు చైతన్యం కలిగించాలని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు కోరారు. కృష్ణాజిల్లా గన్నవరం మండలం చిన్న అవుటపల్లిలోని డాక్టర్‌ పిన్నమనేని సిద్ధార్థ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌లో నూతనంగా ఏర్పాటుచేసిన 1200 ఎల్‌పీఎం పీఎస్‌ఏ ఆక్సిజన్‌ ప్లాంట్‌తో పాటు అడ్వాన్స్‌డ్‌ బయో మెడికల్‌ ఎక్విప్‌మెంట్, న్యూరో, కార్డియాక్‌ విభాగాలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 105 కోట్ల మందికి కరోనా టీకా అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రయత్నం అభినందనీయమన్నారు. వైద్యులు, రోగుల నిష్పత్తిలో చాలా అంతరం ఉందన్నారు. వైద్యులు మానవీయ కోణంలో చికిత్స చేయాలని వెంకయ్యనాయుడు సూచించారు. ప్రభుత్వ వైద్యులు తమ తొలి ప్రమోషన్‌కు ముందు గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించడాన్ని తప్పనిసరి చేయాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. 

టెలిమెడిసిన్‌తో వైద్య ఖర్చులు తక్కువ 
గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలను మెరుగుపరిచేందుకు టెలిమెడిసిన్‌ విధానం విస్తరణపై దృష్టిసారించాలని ఉపరాష్ట్రపతి అన్నారు. దీని ద్వారా వైద్య ఖర్చులు తగ్గడంతోపాటు వారికి కనీస వైద్యసేవలు అందించేందుకు వీలవుతుందన్నారు. అందరికీ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ప్రైవేట్‌ రంగం కూడా తోడ్పాటునందించాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో భాగంగా వైద్య విద్యార్థులతో జరిగిన ఇష్టాగోష్టిలో మెడికోల సందేహాలను ఆయన నివృత్తి చేశారు.

డాక్టర్‌ పిన్నమనేని సిద్ధార్థ ఆస్పత్రి గడచిన సంవత్సరం నుంచి 6 వేల మంది కోవిడ్‌ ప్రభావితులకు వైద్య సేవలు అందించగా, టాటా ట్రస్టు వీటిని గుర్తించి ఆస్పత్రికి రూ.2.5 కోట్ల విలువచేసే బయో మెడికల్‌ పరికరాలను ఇచ్చిందని యాజమాన్యం తెలిపింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్‌ వల్లభనేని వంశీ, సిద్ధార్థ అకాడమీ ప్రతినిధులు ఎన్‌. వెంకటేశ్వర్లు, డాక్టర్‌ చదలవాడ నాగేశ్వరరావు, పాలడుగు లక్ష్మణరావు, ప్రిన్సిపాల్‌ డా. పీఎస్‌ఎన్‌. మూర్తి, మెడికల్‌ సూపరింటెండెంట్‌ అనిల్‌కుమార్, పలువురు అధ్యాపకులు  పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు