ఎస్‌బీఐ మాజీ చైర్మన్‌ ప్రతీప్‌ చౌదరి అరెస్ట్‌

2 Nov, 2021 04:02 IST|Sakshi

ఒక ఎన్‌పీఏ కేసులో మోసపూరిత చర్యల ఆరోపణలు

జైసల్మేర్‌ (రాజస్తాన్‌): బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) మాజీ ఛైర్మన్‌ ప్రతీప్‌ చౌదరి సోమవారం అరెస్టయ్యారు. ఇక్కడి చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ ఆయన బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించారు. 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించారు. రూ.25 కోట్ల రుణ చెల్లింపు వైఫల్యం వ్యవహారంలో దాదాపు 200 కోట్ల హోటల్‌ ఆస్తి జప్తు, ఆ ఆస్తిని అతి తక్కువ ధర దాదాపు రూ.25 కోట్లకు అసెట్‌ రికన్‌స్ట్రక్షన్‌ కంపెనీ (ఏఆర్‌సీ)కి విక్రయించడం తత్సంబంధ లావాదేవీల్లో తీవ్ర అవకతవకలు జరిగినట్లు ఆయనపై ఆరోపణ. ఢిల్లీలో ఆయనను అరెస్ట్‌ చేసి, జైసల్మేర్‌కు తీసుకువచ్చినట్లు సమాచారం.

పోలీసు అధికారుల కథనం ప్రకారం  2007లో జైసల్మేర్‌లో  ‘గర్‌ రాజ్‌వాడ’ హోటల్‌ ప్రాజెక్టుకుగాను గోడవన్‌ గ్రూప్‌నకు ఎస్‌బీఐ దాదాపు రూ.25 కోట్ల రుణం అందించింది. మూడేళ్లపాటు ఆ ప్రాజెక్టు ఎటువంటి పురోగతి లేదు. 2010లో ఈ అకౌంట్‌ మొండిబకాయిగా (ఎన్‌పీఏ) మారింది. రుణ పరిష్కార కేసులో దాదాపు రూ.200 కోట్ల విలువైన  హోటల్‌ ప్రాపర్టీని సీజ్‌ చేసి, మోసపూరిత మార్గాల ద్వారా కేవలం రూ.25 కోట్లకే అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీ (ఏఆర్‌సీ)కి విక్రయించినట్లు చౌదరిపై 2015లో కేసు నమోదైంది. హోటల్‌ను కొనుగోలు చేసిన కంపెనీ బోర్డు డైరెక్టర్‌గా చౌదరి చేరడం వివాదానికి ప్రధాన కేంద్ర బిందువుగా కనబడుతోంది.

విధివిధానాల ప్రకారమే విక్రయం: ఎస్‌బీఐ 
విక్రయించేటప్పుడు అన్ని విధి విధానాలను అనుసరించినట్లు ఎస్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే సంఘటనల క్రమం గురించి కోర్టుకు సరిగ్గా వివరించినట్లు కనిపించడం లేదని బ్యాంక్‌ పేర్కొనడం గమనార్హం. ఈ కేసులో ఎస్‌బీఐ పార్టీ కాదని, కోర్టు విచారణలో భాగంగా బ్యాంకు అభిప్రాయాలను వినిపించే సందర్భం ఏదీ రాలేదని వివరించింది. 2014లో తమ బోర్డులో చేరిన చౌదరి తో సహా ఏఆర్‌సీ డైరెక్టర్లందరి పేర్లను ఈ కేసులో చేర్చినట్లు ఎస్‌బీఐ తెలిపింది. చౌదరి సెప్టెంబర్‌ 2013లో పదవీ విరమణ చేసినట్లు పేర్కొంది.  

ప్రేరేపిత చర్య: రజనీష్‌ కుమార్‌ 
ప్రతీప్‌ చౌదరి అరెస్టు ప్రేరేపితమైన, తీవ్రమైన చర్యని ఎస్‌బీఐ మాజీ ఛైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ పేర్కొన్నారు. ‘ఏఆర్‌సీలకు ఆస్తులను విక్రయించడానికి ఆర్‌బీఐ మార్గదర్శకాలు ఉన్నాయి. వీటికి అనుగుణంగానే జరిగినట్లు సుస్పష్టం. ఇక్కడ అవినీతి ఎక్కడుంది?’ అని కుమార్‌ ప్రశ్నించారు. 
 

మరిన్ని వార్తలు