లేటరైట్‌ గనుల్లో విజిలెన్స్‌ తనిఖీలు

2 Aug, 2021 02:57 IST|Sakshi
ఆండ్రూ కంపెనీ జరిపిన అక్రమ తవ్వకాలను తనిఖీ చేస్తున్న మైనింగ్‌ విజిలెన్స్‌ అధికారులు

తూర్పు గోదావరి జిల్లా వంతాడ, అరలధార గ్రామాల పరిధిలో 8 లీజులు

క్వారీల్లో భారీ ఎత్తున తవ్వకాలు జరపడంతో డ్రోన్‌ సర్వేకు నిర్ణయం.. టీడీపీ హయాంలో అడవిని తొలిచి కొండపై 200 ఎకరాల్లో తవ్వకాలు

సాక్షి, అమరావతి: ఆండ్రూ గ్రూప్‌ ఆఫ్‌ మినరల్స్‌కు చెందిన లేటరైట్‌ లీజుల్లో మైనింగ్‌ విజిలెన్స్‌ ప్రత్యేక బృందాలు భారీ ఎత్తున తనిఖీలు చేపట్టాయి. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం వంతాడ, అరలధార గ్రామాల పరిధిలో ఉన్న 8 లీజుల్లో జరిగిన తవ్వకాల తీరును అడుగడుగునా పరిశీలిస్తున్నాయి. వాటికి సంబంధించి కాకినాడ పోర్టులో ఉన్న 5 స్టాక్‌ యార్డులను సైతం విజిలెన్స్‌ అధికారులు తనిఖీ చేస్తున్నారు. మాన్యువల్, ఈటీఎస్, డీజీపీఎస్‌ సర్వేల ద్వారా తవ్వకాలు ఏ మేరకు జరిగాయో పరిశీలించారు. వీటిద్వారా స్టాక్‌ యార్డులకు సంబంధించిన లేటరైట్‌ లెక్కలు బేరీజు వేస్తున్నారు. క్వారీల్లో జరిగిన తవ్వకాల లెక్కల్ని ఈ సర్వేలతో చేయడం సాధ్యం కాకపోవడంతో డ్రోన్‌ సర్వే చేయడానికి గనుల శాఖ ప్రభుత్వ అనుమతి తీసుకుంది.

బెంగళూరుకు చెందిన డ్రోన్‌ నిపుణులతో త్వరలో సర్వే చేసి ఎంత మేరకు తవ్వకాలు జరిగాయో నిర్థారించనున్నారు. సముద్ర మట్టానికి 400 అడుగుల ఎత్తులో లీజులున్న ఈ కొండ ఉండటం, భారీగా తవ్వకాలు జరపడంతో అక్కడ సాధారణ సర్వే చేయడం సాధ్యం కాలేదని సమాచారం. అందుకే డ్రోన్ల సాయంతో ఆధునిక పరికరాలు ఉపయోగించి ఏరియల్‌ సర్వే చేయనున్నారు. ఈ సర్వే ద్వారా తవ్వకాలను పూర్తిగా లెక్కించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ లీజుల్లో పెద్దఎత్తున ఉల్లంఘనలు జరిగినట్టు మైనింగ్‌ అధికారులు చెబుతున్నారు. వాటిని లెక్కించడానికి కొంత సమయం పడుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం స్టాక్‌ యార్డులకు వచ్చిన లేటరైట్, ప్రభుత్వానికి కట్టిన సీనరేజిని లెక్కిస్తున్నారు. ఇందులో వచ్చిన తేడాను బట్టి అక్రమ తవ్వకాలను నిర్థారిస్తారు.

200 ఎకరాల అటవీ భూమిలో తవ్వకాలు 
అరలధార, వంతాడ అటవీ ప్రాంతంలో ఆండ్రు గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ టీడీపీ ప్రభుత్వ హయాంలో 8 లేటరైట్‌ లీజులు తీసుకుంది. ఒక్కో లీజులో పది హెక్టార్ల చొప్పున 8 లీజులకు 80 హెక్టార్ల (200 ఎకరాలు) భూమిని లీజుకు తీసుకుంది. ఈ అటవీ ప్రాంతాన్ని తీసుకున్నందుకు పరిహారంగా అనంతపురం జిల్లాలో అటవీ ప్రాంతాన్ని పెంచేందుకు అప్పట్లో ఆండ్రు కంపెనీకి అనుమతిచ్చారు. సాధారణంగా అటవీ ప్రాంతంలో మైనింగ్‌కు అనుమతులు తెచ్చుకోవడం సాధ్యమయ్యేపని కాదు. కానీ అప్పట్లో ఆండ్రు కంపెనీ పలుకుబడి ఉపయోగించి అనుమతులు తెచ్చుకున్నట్టు తెలిసింది. గనుల్లో అనుమతులకు మించి భారీగా లేటరైట్‌ను తవ్వి తరలించేసినట్టు ఫిర్యాదులు వచ్చాయి. తవ్వకాల కోసం మైనింగ్‌ నిబంధనలను సైతం ఉల్లంఘించినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పలుమార్లు ఈ క్వారీల్లో తనిఖీలు జరిపారు. తాజాగా విజయనగరం మైనింగ్‌ విజిలెన్స్‌ అధికారులు సూర్యచంద్రరావు, ప్రతాప్‌రెడ్డి నేతృత్వంలో తనిఖీలు చేపట్టారు. తాజాగా అన్ని మైనింగ్‌ విజిలెన్స్‌ బృందాలు ప్రస్తుతం ఈ గనుల్లో తనిఖీలు జరుపుతున్నాయి.

మరిన్ని వార్తలు