ఇది.. ప్రధాని మోదీకి గౌరవసభ 

7 Nov, 2022 04:50 IST|Sakshi
సమీక్షలో మాట్లాడుతున్న ఐటీ శాఖ మంత్రి అమర్‌నాథ్, ఎంపీ విజయసాయిరెడ్డి

12వ తేదీ 11 గంటలకు సభ.. ప్రజలు 10గంటలకే రావాలి 

ప్రధానమంత్రికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఘన స్వాగతానికి ఏర్పాట్లు  

ఏర్పాట్లపై సమీక్షలో మంత్రి అమర్‌నాథ్, ఎంపీ విజయసాయిరెడ్డి 

సాక్షి, విశాఖపట్నం: దాదాపు నాలుగేళ్ల తర్వాత ఈ నెల 11వ తేదీన విశాఖపట్నం వస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఘనస్వాగతం పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ఎంపీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి చెప్పారు. 12వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ప్రధాని బహిరంగసభని రాజకీయసభగా కాకుండా.. మోదీకి అందిస్తున్న గౌరవసభగా అన్ని పార్టీల ప్రతినిధులు, ప్రజలు భావించాలని కోరారు.

ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లపై కలెక్టరేట్‌లో ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అమర్‌నాథ్‌ మాట్లాడుతూ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడానికి రెండురోజుల పర్యటనకు వస్తున్న ప్రధాని సభాప్రాంగణంలో అసౌకర్యాలు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రధాని సభకు పెద్ద ఎత్తున హాజరయ్యే ప్రజలు ఎంత సురక్షితంగా సభకు వస్తారో, అంతే సురక్షితంగా వారు ఇళ్లకు చేరుకునేలా చూడాలన్నారు.

ఈ సభలో ముందుగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, అనంతరం ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగిస్తారని తెలిపారు. ఎంపీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోదీ ఈ నెల 11వ తేదీ రాత్రి ఏడుగంటలకు విశాఖ చేరుకుంటారని, ఆయనకు సీఎం వైఎస్‌ జగన్‌ ఆత్మీయ స్వాగతం పలుకుతారని చెప్పారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి, ప్రధాని కొద్దిసేపు సమావేశమవుతారన్నారు.

12వ తేదీన ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ కాలేజీ గ్రౌండ్స్‌లో జరిగే సభలో ఏడు పథకాలకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని చెప్పారు. ప్రధాని సభకు భారీగా తరలివచ్చే జనానికి అవసరమయ్యే కనీస సౌకర్యాలను 10వ తేదీ నాటికి పూర్తిచేయాలని అధికారుల్ని కోరారు. ముఖ్యంగా తాగునీరు, టాయిలెట్స్, ఫస్ట్‌ ఎయిడ్‌ సెంటర్లను ఎక్కడికక్కడ ఏర్పాటు చేయాలని సూచించారు. 11 గంటలకి మోదీ సభ ప్రారంభం అవుతుందని, 10 గంటలకే ప్రజలు సభా ప్రాంగణానికి వచ్చేలా చూడాలని చెప్పారు. 

25 మందితో కలెక్టరేట్‌లో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ 
కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున మాట్లాడుతూ సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టాయిలెట్లు, అంబులెన్సులు, మెడికల్‌ క్యాంపులు, తాగునీరు అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. సభాప్రాంగణానికి జనం తరలివచ్చే మార్గాలను నిరంతరం పర్యవేక్షించేందుకు 25 మంది సిబ్బందితో కలెక్టరేట్‌లో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

నగర పోలీస్‌ కమిషనర్‌ శ్రీకాంత్‌ మాట్లాడుతూ ప్రధాని సభకు జనాన్ని తీసుకువచ్చే వాహనాలను నగరంలోని వివిధ ప్రాంతాల్లో పార్క్‌ చేయడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సభాప్రాంగణం నుంచి వీఐపీలు వెళ్లిన తర్వాత జనాన్ని సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్యే నాగిరెడ్డి, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, విజయనగరం జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, వైఎస్సార్‌సీపీ విశాఖ ఉత్తర నియోజకవర్గం ఇన్‌చార్జ్, నెడ్‌క్యాప్‌ చైర్మన్‌ కె.కె.రాజు, జీవీఎంసీ కమిషనర్‌ రాజాబాబు, జాయింట్‌ కలెక్టర్‌ కె.ఎస్‌.విశ్వనాథన్, ఆర్‌డీవో హుస్సేన్‌ సాహెబ్, ఏయూ రిజిస్ట్రార్‌ కృష్ణమోహన్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు