1,940 గ్రామాల్లో రీ సర్వే పూర్తి  | Sakshi
Sakshi News home page

1,940 గ్రామాల్లో రీ సర్వే పూర్తి 

Published Mon, Nov 7 2022 6:10 AM

Completed re-survey in 1940 villages Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూరక్ష, శాశ్వత భూహక్కు పేరుతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న భూముల రీ సర్వే 1,940 గ్రామాల్లో పూర్తయింది. ఈ గ్రామాల్లో 17 లక్షల 25 వేల 690 ఎకరాలను పూర్తిగా కొలిచి సర్వే పూర్తిచేశారు. ఆ గ్రామాల్లో సర్వే పూర్తికి సంబంధించిన నంబర్‌ 13 నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఈ గ్రామాలకు కొత్త రెవెన్యూ రికార్డులు అందుబాటులోకి రానున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 351 గ్రామాల్లో రీ సర్వే పూర్తిచేశారు.

విజయనగరం జిల్లాలో 181, అనకాపల్లిలో 143, చిత్తూరులో 125, కాకినాడలో 121, నెల్లూరు జిల్లాలో 118 గ్రామాల్లో భూముల కొలత పూర్తయింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అతి తక్కువగా రెండుగ్రామాల్లో మాత్రమే సర్వే పూర్తి చేయగలిగారు. ఆ జిల్లాలో వ్యవసాయ భూములు కొండలు, గుట్టల్లో ఉండడం, మొబైల్‌ సిగ్నల్స్‌ అందకపోవడంతో డ్రోన్ల ద్వారా సర్వేచేయడం ఇబ్బందికరంగా మారింది.

అందుకే అక్కడ త్వరలో డీజీపీఎస్‌ సర్వే చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. గుంటూరు జిల్లాలో ఐదుగ్రామాలు, నంద్యాల జిల్లాలో 11, ఎన్టీఆర్‌ జిల్లాలో 14, పశ్చిమగోదావరి జిల్లాలో 16 గ్రామాల్లో మాత్రమే సర్వే పూర్తయింది. ఇక్కడా డీజీపీఎస్, ఏరియల్‌ సర్వేకి ఏర్పాట్లు చేస్తున్నారు.  

త్వరలో 1,329 గ్రామాల్లో పూర్తికానున్న సర్వే   
త్వరలో మరో 1,329 గ్రామాల్లో రీ సర్వే పూర్తికానుంది. కొద్దిరోజుల్లోనే ఈ గ్రామాలకు సంబంధించిన 13 నంబర్‌ నోటిఫికేషన్లు జారీచేయనున్నారు. రీ సర్వేకి సంబంధించి రైతులు, భూ యజమానుల నుంచి 18,387 వినతులు, అభ్యంతరాలు వచ్చాయి. వాటిలో 18,277 వినతులను మొబైల్‌ మేజిస్ట్రేట్‌ బృందాలు పరిష్కరించాయి. ఇప్పటివరకు 6,533 గ్రామాల్లో డ్రోన్‌సర్వే పూర్తయింది.

అందులో 3,258 గ్రామాలకు సంబంధించి అభివృద్ధి చేసిన డ్రోన్‌ ఛాయాచిత్రాలను సర్వే బృందాలకు అందించారు. వాటి ఆధారంగా 2,273 గ్రామాల్లో క్షేత్రస్థాయి నిజనిర్ధారణ (గ్రౌండ్‌ ట్రూతింగ్‌) పూర్తయింది. 2,022 గ్రామాల్లో గ్రౌండ్‌ వ్యాలిడేషన్‌ (హద్దుల నిర్దారణ) పూర్తిచేశారు. విభాగాల వారీగా రీ సర్వేను అనుకున్న దానికంటె వేగంగా నిర్వహిస్తున్నట్లు సర్వే, సెటిల్మెంట్‌ అధికారులు చెబుతున్నారు.  

Advertisement
Advertisement