గ్రామ వలంటీర్‌ నుంచి సర్పంచ్‌గా.. 

11 Feb, 2021 11:26 IST|Sakshi
గొర్రిపూడి సర్పంచ్‌గా ఎన్నికైన వలంటీర్‌ రమాదేవి, గ్రామ కమిటీ అధ్యక్షుడు చీకాల సుబ్బారావును అభినందిస్తున్న మంత్రి కన్నబాబు

గొర్రిపూడిలో 508 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన కానూరు రమాదేవి

కరప: గతనెల వరకు ఆమె గ్రామ వలంటీర్‌. నేటి నుంచి గ్రామ సర్పంచ్‌. తమ కళ్ల ముందు తిరుగుతూ కనిపించే అమ్మాయి సర్పంచ్‌ అయిందంటే ఆ గ్రామ ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. కరప మండలం గొర్రిపూడి గ్రామానికి చెందిన కానూరు రమాదేవి ఇంటర్‌ వరకు చదువుకున్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గ్రామవలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రయోజనం పొంది, గ్రామవలంటీర్‌గా విధుల్లోకి చేరింది. ఏడాదిన్నరగా తనకు కేటాయించిన 50 కుటుంబాలను కలసి, ప్రభుత్వ పథకాలను వారికి చేరువ చేస్తోంది.  పంచాయతీ ఎన్నికలు రావడంతో గొర్రిపూడి గ్రామం బీసీ మహిళకు రిజర్వ్‌ అయ్యింది.

వైఎస్సార్‌ సీపీ గ్రామకమిటీ అధ్యక్షుడు చీకాల సుబ్బారావు ప్రోత్సాహంతో రమాదేవి వలంటీర్‌ పదవికి రాజీనామా చేసి, పంచాయతీ ఎన్నికల్లో గ్రామ సర్పంచ్‌గా నామినేషన్‌ వేశారు. ఈ గ్రామంలో జరిగిన త్రిముఖపోటీలో 508 ఓట్ల మెజార్టీతో సర్పంచ్‌గా గెలుపొందారు. ఈ ఎన్నికలో మొత్తం 4,229 ఓట్లు పోలవ్వగా రమాదేవికి 2002, సమీప ప్రత్యర్థికి 1494 ఓట్లు, టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థికి 613 ఓట్లు రావడంతో 508 ఓట్ల మెజార్టీతో గ్రామవలంటీర్‌ రమాదేవి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. రాష్ట్ర వ్యవసాయ, సహకారశాఖల మంత్రి కురసాల కన్నబాబు, గ్రామపెద్దల సహకారంతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని కొత్త ఎన్నికైన సర్పంచ్‌ రమాదేవి తెలిపారు.
(చదవండి: 24ఏళ్లకే సర్పంచ్‌..)
వీరికి లక్కుంది..!  

మరిన్ని వార్తలు