దేశంలో మూడో స్వచ్ఛ నౌకాశ్రయంగా విశాఖ పోర్టు

1 Oct, 2021 05:04 IST|Sakshi

దొండపర్తి (విశాఖ దక్షిణ): విశాఖ పోర్ట్‌ ట్రస్ట్‌ మరో ఘనతను సొంతం చేసుకుంది. దేశంలోనే మూడో స్వచ్ఛ నౌకాశ్రయంగా అవార్డును దక్కించుకుంది. స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమంలో భాగంగా 2019 సంవత్సరానికి సంబందించి ఈ అవార్డును కేంద్ర పోర్టులు, షిప్పింగ్, వాటర్‌వేస్‌ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమంలో విశాఖ పోర్ట్‌ ట్రస్ట్‌లో అన్ని విభాగాలు, శాఖల్లో స్వచ్ఛ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది.

పోర్టు లోపలే కాకుండా పరిసర ప్రాంతాల్లోను, జ్ఞానాపురంలో కూడా పరిశుభ్రత కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించింది. సాలిగ్రామపురం, జాలారిపేట, బీచ్‌ రోడ్డులలో పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమాలు, విద్యార్థులకు పరిశుభ్రతపై పోటీలు నిర్వహించింది. దేశవ్యాప్తంగా మేజర్‌ పోర్టులు నిర్వహించిన ఈ స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమంలో విశాఖ పోర్ట్‌ ట్రస్ట్‌కు 3వ క్లీనెస్ట్‌ పోర్ట్‌గా కేంద్ర పోర్టులు, షిప్పింగ్, వాటర్‌వేస్‌ మంత్రిత్వ శాఖ గుర్తిస్తూ అవార్డును ప్రకటించింది. దీనిపై విశాఖ పోర్ట్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ కె.రామమోహనరావు పోర్టు అధికారులు, ఉద్యోగులను అభినందించారు. 

మరిన్ని వార్తలు