కుమార్తె ప్రేమవివాహం.. ఆటోతో ఢీకొట్టి.. చనిపోయాడనుకొని..

25 Nov, 2022 06:44 IST|Sakshi
భార్య, భర్త సుకన్య, వీరేష్‌(ఫైల్‌)  

సాక్షి, కర్నూలు(పెద్దకడబూరు): ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకునిపై అమ్మాయి తండ్రి, బంధువులు కొడవళ్లు, ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన మండల పరిధిలోని హెచ్‌.మురవణి నాలుగవ మైలు రాయి వద్ద గురువారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ శ్రీనివాసలు, బాధితురాలు తెలిపిన వివరాలు.. హెచ్‌.మురవణి గ్రామానికి చెందిన ఉసేని కూతురు సుకన్య(24) గత ఏడాది డిసెంబర్‌లో కాంట్రాక్ట్‌ పద్ధతిన స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీహెచ్‌ఓ(కమ్మునిటీ హెల్త్‌ ఆఫీసర్‌)గా విధుల్లో చేరారు.

అదే గ్రామానికి చెందిన పెద్ద ఈరన్న కుమారుడు వీరేష్‌(28)ను ఫిబ్రవరిలో ప్రేమ వివాహం చేసుకుంది. ప్రేమ వివాహం అమ్మా యి తల్లిదండ్రులకు నచ్చకపోవడంతో ఎమ్మిగనూరు పట్టణంలో వేరు కాపురం పెట్టారు. వీరేష్‌ తన భార్యను రోజూ ఉదయం ద్విచక్ర వాహనంపై హెచ్‌.మురవణికి వెళ్లి డ్యూటీకి వదిలిపెట్టి సాయంత్రం తీసుకొని వచ్చేవాడు. అందులో భాగంగా గురువారం సాయంత్రం తన భార్యను బైక్‌పై తీసుకొస్తుండగా అమ్మాయి తండ్రి ఉసేని, వారి బంధువులు ఆటోతో హెచ్‌.మురవణి నాలుగవ మైలురాయి వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టారు.

ఇద్దరూ కింద పడిపోవడంతో వీరేష్‌పై విచక్షణ రహితంగా దాడిచేసి చనిపోయాడని భావించి అక్కడి నుంచి పారిపోయారు. సుకన్య భయంతో పరుగులు తీసింది. ఎమ్మిగనూరు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని పోలీసులకు చెప్పింది. రహదారిలో వెళ్తున్న కొందరు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేయడంతో పాటు చికిత్స నిమిత్తం వీరేష్‌ను ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. భార్య సుకన్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.    

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు