YSR Nethanna Nestham: నేతన్న.. జగనన్న వేర్వేరు కాదు అన్నా!

10 Aug, 2021 13:32 IST|Sakshi

సాక్షి, అమరావతి: కరోనా కష్టకాలంలోనూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది 'వైఎస్సార్‌ నేతన్న నేస్తం' అమలు చేయడం పట్ల లబ్దిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆపత్కాలంలో సంక్షేమ పథకాలతో తమకు అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈ మేరకు మంగళవారం వివిధ కలెక్టరేట్ల నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం జగన్‌తో మాట్లాడారు.

ఈ సందర్భంగా కడప నుంచి వైఎస్సార్‌ నేతన్న నేస్తం లబ్దిదారు మాట్లాడుతూ.. ‘‘మీ తండ్రిగారు మాకు విద్యాదానం చేశారు. ఫీజు రీయింబర్స్‌ పథకం పెట్టారు.. నా కుమారుడు ఇంజనీరింగ్‌ చదివి ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. బడుగు బలహీన వర్గాలకు మైనార్టీలకు మీ తండ్రి గారు ప‍్రవేశ పెట్టిన ఆరోగ్య శ్రీ ద్వారా లబ్దిపొందుతున్నారు. ప్రతీ నెల రేషన్‌, నిత్యావసర సరుకులు ఇంటివద్దకే వస్తున్నాయి. మీ పాలనతో మా తలరాతను మార్చారు. మీరు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో భార్యా పిల్లలతో సంతోషంగా ఉన్నాం’’ అని కృతజ్ఞతలు తెలిపారు.


మీరే కావాలన్నా.. మీరు మళ్లీ మళ్లీ రావాలన్నా
ఎవరూ చేయనంతంగా సాయం చేశారు. నేను ఉన్నానంటూ మాకు కోసం ఆలోచన చేశారు. మా కుటుంబాలకు అండగా నిలిచారు. నవరత్నాల్లో భాగంగా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. రైతు మిత్ర, వాహన మిత్ర ఇలా ఎన్నో పథకాలు మాకు కోసం పెట్టారు. ఈ ఘనత మీదే. అందువల్లే మా కుటుంబాలు మిమ్మల్నే తలుస్తున్నాయి. కార్పోరేట్‌ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లను మార్చడం ఎంతో అభినందనీయం. మీరే కావాలన్నా.. మీరు మళ్లీ మళ్లీ రావాలన్నా. నేను ఉన్నానంటూ మాకు అండగా నిలిచారు. - మహిళా లబ్దిదారు, గుంటూరు.


థాంక్యూ అన్నా
‘‘20 ఏళ్లుగా నేత నేస్తున్నా. కొన్ని రోజుల క్రితం నా భర్త చనిపోయారు. అలా కష్టాల్లో కూరుకుపోయిన సమయంలో.. మీ పుట్టిన రోజు నాడు తొలి విడత నేతన్న నేస్తం ద్వారా రూ. 24 వేలు వేసి మమ్మల్ని ఆదుకున్నారు. చేనేత అంతరించే పోయే సమయంలో మీరు మమ్మల్ని ఆదుకున్నారు. నేనున్నానంటూ మా కుటుంబాల్లో వెలుగు చూపించారన్నా మీ దయతో బతుకున్నా. నాకు బాబు, పాప..  మీరిచ్చిన అమ్మఒడి పథకంతో చదివించుకోగలిగాం. బాబు ఇంటర్‌. మా పాప వాలంటీర్‌గా పనిచేస్తోందన్నా. నేతన్న నేస్తం పథకం, ఆసరా పథకం కూడా మమ్మల్ని నిలబెట్టింది. 

మాకు రోజంతా కష్టపడితే మాకు రెండొందల వచ్చేవి.. మీరు నేతన్న నేస్తం ప్రవేశపెట్టిన తర్వాత మా పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది. నేత మీద ఇప్పుడు లాభం పొందుతున్నా. సొంతింటి కల ఉండేదన్నా. నాకు ఇల్లు స్థలం వచ్చింది. శ్రావణంలో ఇల్లు కట్టుకుంటా అన్నా. మీ పరిపాలనలో ఎల్లప్పుడూ ఇలాగే చల్లగా ఉండాలన్నా. మీతో మాట్లాడటం సంతోషంగా ఉందన్నా. థాంక్యూ అన్నా’’.
- సుబ్బలక్ష్మి, మహిళా లబ్దిదారు, బండారులంక, అమలాపురం, తూర్పు గోదావరి.


నేతన్న.. జగనన్న వేర్వేరు కాదు.. 
మాది నిరుపేద కుటుంబం. మా కష్టాలు తీర్చడానికి ఎవరు వస్తారని ఎదురుచూశాం.. అలాంటి సమయంలో మీరొచ్చారు.. దేవుడిలా మీరొచ్చారు. మీరు పాదయాత్రకి వచ్చినప్పుడు నేను ఉన్నాననే ధైర్యం చెప్పారు.. అది చేసి చూపించారు. మాకు వచ్చిన కష్టాలు తీరుస్తూ అండగా నిలిచారు. మీరిచ్చిన భరోసా, ఆర్థిక సాయంతో ఇప్పుడు మా కుటుంబ ఆదాయం కూడా పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతీ చేనేత కార్మికుడు మూడు పూటల కడుపు నిండా తింటున్నాడంటే అది మీ వల్లే సార్‌. 

రుణమాఫీ, అమ్మబడి, ఆరోగ్య శ్రీ వంటి పథకాల ద్వారా లబ్ది పొందుతున్నాం. మీరు ప్రతీ చేనేత కార్మికుడు గుండెల్లో గుడిని కట్టుకున్నారు.  వైఎస్సార్‌ మాకు జన్మనిస్తే.. మీరు పునర్జన్మనిచ్చారు. మీరిచ్చిన ధైర్యమే మమ్మల్ని నడిపిస్తోంది. మా ముఖాల్లో నవ్వులు కనపడటానికి మీరే కారణం. దేశంలోనే అత్తుత్తమ సీఎంగా నిలుస్తారు. నేను మిమ్మల్ని పొగడటం లేదు సార్‌.. వాస్తవం చెబుతున్నా. నేతన్న.. జగనన్న వేర్వేరు కాదు.. శాశ్వతంగా మీరే సీఎంగా ఉండాలి.
- అనంతపురం లబ్దిదారు.

చదవండి: సీఎం జగన్‌ మా పాలిట దైవం: ఎంపీడీఓ భావోద్వేగం

మరిన్ని వార్తలు