అమ్మపాలెంలో నిమ్మ జాతర.. ఇంటింటికీ సిరుల పంట, ఎలాగంటే..

22 Nov, 2021 16:51 IST|Sakshi

జంగారెడ్డిగూడెం (పశ్చిమ గోదావరి): నష్టాల నుంచి బయటపడేందుకు ఆ పంట వైపు మొగ్గారు. కష్టం కాయై కాసింది. నష్టం గట్టెక్కింది. దీంతో ఆ గ్రామంలోని రైతులు అటుగా అడుగులు వేశారు. నేడు ప్రతీ రైతుకు ఆ పంట సిరులు కురిపిస్తోంది. అదే అమ్మపాలెం నిమ్మ. జంగారెడ్డిగూడెం మండలం అమ్మపాలెంలో ప్రతీ రైతు నిమ్మ పంటను పండిస్తున్నారు. గ్రామంలో సుమారు 100 ఇళ్లు ఉండగా, 150 కుటుంబాలు ఉన్నాయి. వీరిలో 100 మంది రైతులుగా ఉన్నారు. ప్రతీ రైతుకు ఉన్న భూమిలో కొంత భూమిలో నిమ్మ పంట పండిస్తున్నారు. 

మరో విశేషం ఏమిటంటే ప్రధానంగా నిమ్మపంటపై ఆధారపడటమే కాక, కుటుంబసభ్యుల అంతా కలిసి నిమ్మ సేద్యం చేస్తారు. తమ కుటుంబాల్లో ఉన్న విద్యార్థులు కూడా ఖాళీ సమయాల్లో నిమ్మతోటలకు వెళ్లి సొంతంగా కష్టపడుతారు. గ్రామరెవెన్యూ పరిధిలో సుమారు 600 హెక్టార్లు ఉండగా, దీనిలో 300 ఎకరాలు రైతులు నిమ్మపంట వేశారంటే విశేషమేమిటో ఇట్టే అర్థమవుతుంది. సుమారు 15 – 20 ఏళ్ల క్రితం వరకు గ్రామ రైతులు మిరప, పొగాకు వేసేవారు. ఆ సమయంలో ఈ పంటలకు నష్టాలు రావడంతో ఒకరిద్దరు రైతులు ప్రయోగాత్మకంగా నిమ్మపంట వేశారు. అంతే నిమ్మ పంట సిరులు కురిపించింది. 

ఇలా దశలవారీగా రైతులంతా తమ పంట భూమిలో కొంత మేర నిమ్మ పంట వేశారు. మెరకపొలాలు, వరి పొలాల్లో కూడా నిమ్మపంట వేశారు. దీంతో సేద్యపుభూమిలో సగ భూమి నిమ్మతోటలు వేశారు. ఎకరానికి సుమారు లక్ష రూపాయలు ఆదాయం రైతులకు లభిస్తోంది. దీంతో నిమ్మపంట అమ్మపాలెం గ్రామానికి బంగారం పంటగా మారిపోయింది. ఇప్పుడు ఊరంతా నిమ్మపంటపైనే ఆధారపడ్డారు. అంతే గాక రైతు ఇంటి పెరట్లో ఖాళీ జాగా ఉంటే ఖచ్చితంగా ఒకటి రెండు నిమ్మచెట్లు సెంటిమెంట్‌గా పెంచుతున్నారు. ఊరంతా రైతు కుటుంబాలే. వీరంతా ఒకే మాటపై కట్టుబడి ఉంటారు. 

పూర్వం సూరవరపు పున్నయ్య అనే వ్యక్తి గ్రామపెద్దగా వ్యవహరించారు. ఆయన మృతి అనంతరం ఆయన కుమారుడు రాంబాబు ప్రస్తుత గ్రామ పెద్దగా వ్యవహరిస్తున్నారు. అందరూ ఒకే కట్టుబాటు, సాంప్రదాయాలపై ఏకతాటిపై ఉంటారు. గ్రామంలో పండించిన నిమ్మ పంటను కుటుంబసభ్యులంతా ప్రతీ రోజు తోటల్లోకి వెళ్లి నిమ్మకాయలు కోసి సంచుల్లో నింపి ఊర్లో రోడ్డుపక్కన ఉంచుతారు. నిమ్మకాయల వ్యాపారులు మోటార్‌సైకిళ్లపై వచ్చి ఒకొక్క రైతు నుంచి వరుసుగా కొనుగోలు చేసుకుని ట్రక్కు, ఆటోలో ఏలూరు నిమ్మ మార్కెట్‌కు తరలిస్తారు. ఈ విధంగా రైతులకు నిమ్మకాయల మార్కెట్‌ ఇబ్బంది కూడా లేకుండా ఉంది. అమ్మపాలెం పండే నిమ్మ పంట మంచినాణ్యత కలిగి ఉంటుంది. మంచి ధర లభిస్తుంది. 

మరిన్ని వార్తలు