5.83 కోట్ల రిటర్నులు

2 Aug, 2022 06:21 IST|Sakshi

న్యూఢిల్లీ: గడిచిన ఆర్థిక సంవత్సరానికి 5.83 కోట్ల ఆదాయపన్ను రిటర్నులు దాఖలయ్యాయి. జూలై 22 వరకు, గతేడాది ఇదే సమయానికి పోల్చి చూస్తే 40 శాతం రిటర్నులు (2.48 కోట్లు) దాఖలు కాగా.. చివరి 10 రోజుల్లో పెద్ద సంఖ్యలో పన్ను చెల్లింపుదారులు ముందుకు వచ్చి రిటర్నులు వేశారు. గడువు పొడిగించే అవకాశం లేదని ఆదాయపన్ను శాఖ తేల్చి చెప్పడంతో పన్ను చెల్లింపుదారులు చివరి రోజుల్లో త్వరపడ్డారు. ముఖ్యంగా ఆఖరి రోజైన జూలై 31న 72.42 లక్షల రిటర్నులు వచ్చాయి. 2020–21 ఆర్థిక సంవత్సరానికి దాఖలైన పన్ను రిటర్నులు 5.87 కోట్లతో పోలిస్తే 4 లక్షల మేర తగ్గినట్టు తెలుస్తోంది. గతేడాది డిసెంబర్‌ 31 వరకు గడువు ఇవ్వడం అనుకూలించింది. అంతకుముందు 2020లోనూ డిసెంబర్‌ 31 వరకు గడువు పొడిగింపు లభించింది.  

రికార్డులు..
చివరి రోజున ఒక దశలో సెకనుకు 570 చొప్పున, నిమిషానికి 9,573, గంటకు 5,17,030 చొప్పున రిటర్నులు ఫైల్‌ అయినట్టు ఆదాయపన్ను శాఖ ప్రకటించింది. మొత్తం 5.83 కోట్ల రిటర్నుల్లో 50 శాతం ఐటీఆర్‌–1 కాగా, 11.5 శాతం ఐటీఆర్‌–2, 10.9 శాతం ఐటీఆర్‌–3, 26 శాతం ఐటీఆర్‌–4 ఉన్నాయి.  

మరిన్ని వార్తలు