వరుసగా బెదిరింపు ఈమెయిళ్లు.. అంబానీ భద్రత గురించి తెలుసా..?

31 Oct, 2023 11:06 IST|Sakshi

నాలుగు రోజుల్లో మూడుసార్లు ఈమెయిళ్లు

ఈ సారి ఏకంగా రూ.400 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్‌

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముఖేష్ అంబానీకి వరుసగా బెదిరింపు ఈమెయిల్స్‌ వస్తున్నాయి. గతంలో రూ.20 కోట్లు, రూ.200 కోట్లు ఇవ్వాలన్న డిమాండ్‌తో మెయిళ్లు రాగా.. తాజాగా రూ.400 కోట్ల డిమాండ్‌  వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ బెదిరింపులకు పాల్పడుతున్న దుండగులు ముఖేశ్‌ అంబానీపై ప్రత్యక్షంగా దాడి చేసే ప్రయత్నం చేసే అవకాశాలు తక్కువే. ఎందుకంటే ఆయనకు కల్పిస్తున్న భద్రత అలా ఉంది మరి! ప్రస్తుతం అంబానీకి జెడ్‌ప్లస్‌ కేటగిరీ భద్రత కల్పిస్తున్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గతేడాది నుంచే భద్రతను పెంచింది. గతంలో ముంబైలోని ముఖేశ్ అంబానీ నివాసం ఆంటిలియా సమీపంలో బాంబు భయం తర్వాత పారిశ్రామిక వేత్తల భద్రతపై కేంద్ర మంత్రిత్వ శాఖ దృష్టి సారించింది.

భద్రత ఎవరికంటే..

ప్రముఖులకు సంఘ విద్రోహశక్తుల నుంచి అపాయం ఉందని భావిస్తే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ భద్రత ఏర్పాటు చేస్తుంది. వీరిలో అత్యధిక ప్రజాదరణ కలిగి..వారి జీవితాలు ప్రమాదంలో ఉన్నాయని నిఘా సంస్థలు అందించే సమాచారం ఆధారంగా భద్రత అందిస్తారు. సంఘ విద్రోహశక్తుల నుంచి వీరిని కాపాడడం వారి విధి. నిఘా సంస్థ అందించే రిపోర్ట్ ఆధారంగా వివిధ రకాల భద్రతా కేటగిరీలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వారికి కేటాయిస్తుంది. ప్రమాదాలను అంచనా వేసి భద్రతా వర్గాన్ని ఐదు గ్రూపులుగా విభజించింది. వాటిలో ఎక్స్, వై, జెడ్, జెడ్ ప్లస్, ఎస్‌పీజీ వర్గాలున్నాయి. భారత్‌లోని వీఐపీలు, వీవీఐపీలు, ఇతర ఉన్నత స్థాయి లేదా రాజకీయ ప్రముఖులకు ఈ రకమైన భద్రత ఏర్పాటు చేస్తుంది. అయితే గతేడాది నుంచి ముకేశ్‌ అంబానీకి జెడ్‌ప్లస్‌ కేటగిరీ భద్రత అందిస్తుంది.

జెడ్ ప్లస్ భద్రత అంటే..

రక్షణలో ఎస్‌పీజీ తర్వాత జెడ్ ప్లస్ భద్రత అనేది రెండో అత్యధిక స్థాయి భద్రతా. ఇందులో భాగంగా 10+ ఎన్‌ఎస్‌జీ కమాండోలు, పోలీసు అధికారులతో కలుపుకుని 55మంది సిబ్బంది వీరికి రక్షణగా ఉంటారు. వీరంతా మార్షల్ ఆర్ట్స్, పోరాట శిక్షణలో నైపుణ్యం పొందినవారు. ఈ కేటగిరీలో భాగంగా 5+ బులెట్‌ప్రూఫ్‌ వాహనాలు ఉంటాయి. దేశంలో ఇప్పటివరకు కేవలం 43 ప్రముఖులకు మాత్రమే ఈ భద్రత కల్పిస్తున్నారు. భద్రత సిబ్బంది వేతనాలు, ప్రయాణ భత్యాలు, వాహనాలు వంటి ఖర్చులను సందర్భాన్ని బట్టి వివిధ ఏజెన్సీలతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, భద్రత పొందే వ్యక్తులు, సంస్థలు భరిస్తాయి. ఎస్‌పీజీ మాత్రం దేశ ప్రధానికి భద్రత కల్పిస్తుంది.

మరిన్ని వార్తలు