అదానీ షేర్ల తనఖా రుణాల చెల్లింపు

14 Mar, 2023 03:58 IST|Sakshi

చెల్లించిన మొత్తం రూ. 17,630 కోట్లు

న్యూఢిల్లీ: షేర్ల తనఖా ద్వారా తీసుకున్న 215 కోట్ల డాలర్ల(రూ. 17,630 కోట్లు) రుణాలను తిరిగి చెల్లించినట్లు ప్రయివేట్‌ రంగ దిగ్గజం అదానీ గ్రూప్‌ తాజాగా పేర్కొంది. ఈ నెలాఖరుకు గడువు ఉన్నప్పటికీ ముందుగానే చెల్లించినట్లు తెలియజేసింది. ఈ బాటలో సంస్థ ఇప్పటికే 90.2 కోట్ల డాలర్లు(రూ. 7,374 కోట్లు) చెల్లించింది. వెరసి మొత్తం రూ. 17,630 కోట్ల రుణాలను క్లియర్‌ చేసినట్లు అదానీ గ్రూప్‌ వివరించింది. అంతేకాకుండా అంబుజా సిమెంట్‌ కొనుగోలుకి తీసుకున్న మరో 50 కోట్ల డాలర్ల(రూ. 4,100 కోట్లు) రుణాలను సైతం చెల్లించినట్లు వెల్లడించింది. ఇటీవలే గ్రూప్‌లోని నాలుగు లిస్టెడ్‌ కంపెనీలలో స్వల్ప వాటాల విక్రయం ద్వారా రూ. 15,446 కోట్లు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. జీక్యూజీ పార్ట్‌నర్స్‌ ఈ వాటాలను కొనుగోలు చేసింది.  

షేర్ల తీరిలా
అదానీ గ్రూప్‌ షేర్లు సోమవారం మిశ్రమంగా ట్రేడయ్యాయి. ఎన్‌డీటీవీ, ఏసీసీ, అంబుజా సిమెంట్స్, అదానీ విల్మర్, పోర్ట్స్‌ అండ్‌ సెజ్, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 5–1 శాతం క్షీణించాయి. అయితే అదానీ పవర్, ట్రాన్స్‌మిషన్, గ్రీన్‌ ఎనర్జీ, అదానీ టోటల్‌ గ్యాస్‌ 5 శాతం చొప్పున జంప్‌ చేశాయి. 

మరిన్ని వార్తలు