అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ రేట్లు పెరిగాయ్‌! ఇవాళ్టి నుంచే..

14 Dec, 2021 08:58 IST|Sakshi

Amazon Prime membership costlier: ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ ప్యాకేజీలను సవరించింది. పెంచిన ధరలను నేటి నుంచి (డిసెంబర్‌ 14) భారత్‌లో అమలు చేయనుంది. దీంతో యూజర్లకు భారం తప్పదు.


సవరించిన ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ ధరలు భారత్‌లో ఇవాళ్లి(డిసెంబర్‌ 14, 2021 మంగళవారం) నుంచే అమలులోకి వచ్చాయి. అర్ధరాత్రి నుంచే సవరించిన ప్యాకేజీని చూపిస్తోంది అమెజాన్‌. గతంలో నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ రూ.129 ఉండగా అది కాస్తా రూ.179కి(38శాతం) పెంచింది. మూడు నెలల సబ్‌ స్క్రిప్షన్‌ ధర రూ.329 ఉండగా రూ.459కి(39శాతం) పెరిగింది. వార్షిక సబ్‌ స్క్రిప్షన్‌ ధర రూ. 999 ఉండగా అది కాస్త రూ.1,499కి(50 శాతం) పెరిగింది.

 

ఛార్జీల మోత నుంచి ఉపశమనం కోసం డిసెంబర్‌ 13 కంటే ముందుగానే ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ ప్లాన్‌(కొత్త యూజర్ల కోసం), రెన్యువల్‌ చేసుకోవాలంటూ సూచించిన విషయం తెలిసిందే. ‘లాస్ట్‌ ఛాన్స్‌ టూ జాయిన్‌ ప్రైమ్‌’ పేరుతో  ప్రచారం చేసింది. ఇక ఇప్పుడు ఆఫర్లతో ఎంపిక చేసిన యూజర్లకు తక్కువ ధరలకే ప్యాకేజీ అందించే అవకాశం లేకపోలేదు.

అమెజాన్‌ ప్రైమ్‌ ప్యాకేజీలతో విస్తృతమైన సేవలు(షాపింగ్‌,  ఫాస్టెస్ట్‌ డెలివరీ, ఓటీటీ, మ్యూజిక్‌,..ఇలా) అందిస్తున్నందున.. పెరుగుతున్న భారం నేపథ్యంలోనే ఛార్జీలు పెంచాల్సి వచ్చిందని ఒక ప్రకటనలో పేర్కొంది అమెజాన్‌. అమెజాన్‌ ఐదేళ్ల కిందట భారత్‌లో అడుగుపెట్టగా.. మధ్యలో మంత్లీ ప్యాక్‌ను తేవడం, ధరలను సవరించడం ఓసారి చేసింది కూడా. ఇక  ట్రేడ్‌ విషయంలో ఫ్లిప్‌కార్ట్‌తో, ఓటీటీలో నెట్‌ఫ్లిక్స్‌తో ఈమధ్యకాలంలో గట్టిపోటీ ఎదురవుతోంది.

చదవండి: Amazon AWS Outage: కొద్దిగంటలు నిలిచిపోయిన అమెజాన్‌ సర్వీసులు

మరిన్ని వార్తలు