Ananya Birla: బిర్లా వారసురాలు.. తండ్రి పేరు చెప్పుకునే టైపు కాదు! విభిన్న ప్రతిభతో సొంత గుర్తింపు..

20 May, 2023 16:40 IST|Sakshi

అనన్య బిర్లా.. ఆదిత్య బిర్లా గ్రూప్‌ అధినేత, దేశంలో అత్యంత సంపన్నుల్లో ఒకరైన కుమార మంగళం బిర్లా కుమార్తె. సాంప్రదాయ వ్యాపారాలను విడిచిపెట్టి తనకంటూ సొంత మార్గాన్ని ఎంచుకుంది. ఒక్క బిజినెస్‌లోనే కాకుండా వివిధ రంగాల్లో రాణిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

ఇదీ చదవండి: Aditi Avasthi: రూ.1600 కోట్ల నిధులు.. ఎడ్‌టెక్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తున్న అదితి అవస్తీ!

బిర్లా కుటుంబం దేశంలోనే సంపన్న కుటుంబాల్లో ఒకటి. వారికి అనేక వ్యాపారాలు ఉన్నాయి. తండ్రి కుమార మంగళం బిర్లా ఫోర్బ్స్ 2023 భారతీయ బిలియనీర్ల జాబితా ప్రకారం.. దేశంలోనే 9వ అత్యంత సంపన్న వ్యక్తి. వీటితో సంబంధం లేకుండా ఒక వ్యాపారవేత్తగా, గాయనిగా విభిన్న రంగాల్లో రాణిస్తున్న అనన్య బిర్లా చదువు, ఆమె నడుపుతున్న వ్యాపారాలు, నికర సంపద వంటివి తెలుసుకుందాం.

ఉన్నత చదువు, వ్యాపారాలు
అనన్య బిర్లా ముంబైలోని అమెరికన్ స్కూల్ ఆఫ్ బాంబేలో ప్రాథమిక విద్య చదివింది. యూకేలోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌, మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పొందింది. అనన్య బిర్లా స్వతంత్ర మైక్రోఫైనాన్స్ అనే సంస్థను స్థాపించి విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇది  గ్రామీణ ప్రాంతాల్లోని పేద, అల్పాదాయ వర్గాలు, మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సేవలను అందిస్తోంది. ఈ సంస్థకు ఆమె సీఈవోగా కూడా ఉన్నారు. అలాగే క్యూరోకార్టే అనే లగ్జరీ ఈ-కామర్స్ సంస్థను కూడా ఆమె ప్రారంభించారు. హస్త కళాకృతులు, శిల్పకళా ఉత్పత్తులను ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తోంది.

ఇదీ చదవండి: Satyajith Mittal: బూట్లు అమ్మి రూ.లక్షలు సంపాదిస్తున్నారు.. చిన్నప్పుడు పడిన ఇబ్బందే ప్రేరణ!

A post shared by Ananya Birla (@ananyabirla)

విభిన్న ప్రతిభ
అనన్య బిర్లా వ్యాపారవేత్త మాత్రమే కాదు.. విజయవంతమైన సంగీత విద్వాంసురాలు కూడా. ‘లివిన్‌ ద లైఫ్’, ‘హోల్డ్‌ ఆన్‌’ వంటి అద్బుతమైన సింగిల్స్‌ను ఆమె విడుదల చేశారు. తన మ్యూజిక్‌కి అనేక అవార్డులను గెలుచుకున్నారు.

మానసిక ఆరోగ్య న్యాయవాది కూడా అయిన అనన్య.. మానసికంగా తాను పడిన ఇబ్బందులు, కుంగుబాటు వంటి సమస్యలను కూడా నిర్భయంగా బయటపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఆమె అనన్య బిర్లా ఫౌండేషన్‌ను స్థాపించారు. ఇది మానసిక ఆరోగ్య అవగాహనను పెంపొందించడం, మానసిక ఆరోగ్య కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడం వంటి కార్యక్రమాలపై దృష్టి సారించింది. దీంతోపాటు లింగ సమానత్వం, ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూషన్‌, విద్య, వాతావరణ మార్పు, మానవతా సహాయం వంటి అంశాలకు తోడ్పాటును అందిస్తోంది.

నెట్‌వర్త్‌
అనన్య బిర్లా నికర సంపద విలువ సుమారు 13 బిలియన్‌ డాలర్లు ఉంటుందని అంచనా. జీతం గురించి బహిరంగంగా తెలియకపోయినా రెండు విజయవంతమైన కంపెనీలకు వ్యవస్థాపకురాలు, సీఈవోగా ఆమె గణనీయమైన ఆదాయాన్నే ఆర్జిస్తోంది. ఇక సింగర్‌ గానూ సంపాదిస్తోంది.

ఇలాంటి స్పూర్తివంతమైన, విజయవంతమైన వ్యాపారవేత్తల సక్సెస్‌ స్టోరీల కోసం సాక్షి బిజినెస్‌ పేజీని చూడిండి

మరిన్ని వార్తలు