టెక్నాలజీ హబ్‌గా విశాఖపట్నం.. టెక్‌ మహీంద్రా సీఈవోతో సీఎం జగన్‌ చర్చలు

23 May, 2022 16:11 IST|Sakshi

దావోస్‌: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సదస్సు రెండో రోజు ఏపీ సీఎం జగన్‌ పలువురు ప్రముఖులతో వరుసగా సమావేశం అవుతున్నారు. రెండో రోజు ఉదయం సెషన్‌లో ఫ్యూచర్‌ ప్రూఫింగ్‌ హెల్త్‌ సిస్టమ్‌పై నిర్వహించిన సదస్సులో పాల్గొన్న ఆయన ఆ తర్వాత దస్సాల్ట్‌ సిస్టమ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఫ్లోరెన్స్‌ వెర్జలెన్‌, టెక్‌ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీలతో  భేటీ అయ్యారు. ఈ సమావేశాల్లో మానవ వనరుల అభివృద్ధి, నైపుణ్యాల పెంపు అంశాలపై ప్రధానంగా చర్చించారు.

విద్యారంగంలో పెట్టుబడులు
దస్సాల్ట్‌ సిస్టమ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఫ్లోరెన్స్‌ వెర్జలెన్‌తో సీఎం జగన్‌ భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం ఫ్లోరెన్స్‌ వెర్జలెన్‌ మాట్లాడుతూ... ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో సానుకూల వాతావరణంలో సమావేశం జరిగిందన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా నైపుణ్యాలను ఎలా అభివృద్ధిచేయాలన్నదానిపై చర్చ జరిగినట్టు తెలిపారు. అదే విధంగా కొత్త తరహా ఇంధనాలపైనా కూడా సమావేశంలో చర్చించామన్నారు.  విద్యారంగంలో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు దస్సాల్ట్‌  ఉత్సాహంగా ఉందని ఆమె తెలిపారు. 

విశాఖ కేంద్రంగా ఐటీ
దావోస్‌లో ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్‌కి వచ్చిన టెక్‌ మహీంద్రా  సీఈఓ, ఎండీ సీపీ గుర్నానీతో సీఎం సమావేశం అయ్యారు. ఐటీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ఇక్కడి మానవ వనరుల లభ్యత తదితర అంశాలపై వారు చర్చలు జరిపారు. సమావేశం ముగిసిన తర్వాత సీపీ గుర్నానీ మాట్లాడుతూ.. విశాఖపట్నాన్ని మేజర్‌ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి జగన్‌ సంకల్పంతో ఉన్నారని చెప్పారు. ఇక్కడ నైపుణ్యాభివృద్ధిలో పెట్టుబడులు పెట్టాలని టెక్‌ మహీంద్రాను సీఎం కోరారని తెలిపారు. దీనికి గాను ఆంధ్రా వర్శిటీతో కలిసి పనిచేయాలని నిర్ణయించినట్టు టెక్‌ మహీంద్రా చైర్మన్‌ వెల్లడించారు. మానవ నైపుణ్యాలను పెంచేందుకు, హైఎండ్‌ టెక్నాలజీపై వచ్చే మూడు నెలల్లో ఆంధ్ర యూనివర్శిటీతో కలిసి ప్రత్యేక పాఠ్యప్రణాళికను రూపొందిస్తామన్నారు అదే విధంగా ఆర్టిఫియల్‌ ఇంలెటిజెన్స్‌కు ప్రధాన కేంద్రంగా  విశాఖపట్నాన్ని తీర్చిద్దాలనే సంకల్పంతో సీఎం జగన్‌ ఉన్నట్టు గుర్నానీ వెల్లడించారు. 

మరింత మంది ప్రముఖులతో
దావోస్‌లో జరుగుతున్న సమావేశాల ద్వారా భారీ ఎత్తున పెట్టుబడులు సాధించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా సదస్సు రెండో రోజు సీఎం పలువురు ప్రముఖులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. జపాన్‌కు చెందిన ప్రముఖ రవాణా సంస్థ మిట్సుయి ఒ.ఎస్‌.కె.లైన్స్‌ లిమిటెడ్‌ సీఈఓ తకేషి హషిమొటోతో సీఎం జగన్‌ భేటీ కానున్నారు. అదే విధంగా హీరోమోటార్‌ కార్పొరేషన్‌ చైర్మన్ ఎండీ పవన్‌ ముంజల్‌తోనూ జగన్‌ సమావేశం కానున్నారు. చివరగా ఐబీఎం చైర్మన్, సీఈఓ అరవింద్‌ కృష్ణతోనూ సీఎం జగన్‌ చర్చలు జరపనున్నారు. ఇంకా మరింత మంది ప్రముఖులనూ ఆయన కలిసే అవకాశం ఉంది.
చదవండి: ఏపీలో ప్రతీ కుటుంబానికి ‘ఫ్యామిలీ డాక్టర్‌’ - డబ్ల్యూఈఎఫ్‌ సదస్సులో వైఎస్‌ జగన్‌

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు