అథర్‌ బంపర్‌ ఆఫర్‌.. ఏ స్కూటర్‌కైనా ఛార్జింగ్‌ ఫ్రీ

17 Sep, 2021 17:03 IST|Sakshi

ఎలక్ట్రిక్‌ వాహనాలదే భవిష్యత్తు అంటూ ఇటు ప్రభుత్వం నుంచి అటు అటోమొబైల్‌ ఇండస్ట్రీ వరకు ప్రకటనలు గుప్పిస్తోన్నారు. అయితే ఈవీలకు సంబంధించి ఛార్జింగ్‌ పాయింట్‌ సమస్యను తీర్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. తాజాగా గ్రిడ్‌ లోకేషన్‌ పేరుతో ఛార్జింగ్‌ సమస్యలకు చెక్‌ పెట్టేందుకు ముందుకు వచ్చింది అథర్‌ సంస్థ.

గ్రిడ్‌ లోకేషన్‌
ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ తయారీ స్టార్టప్‌ అథర్‌ సంస్థ 450 , 450 ఎక్స్‌ పేరుతో రెండు స్కూటర్లను మార్కెట్‌లో రిలీజ్‌ చేసింది. తొలుత బెంగళూరు, చెన్నైలో మొదలైన స్కూటర్ల అమ్మకాలు ‍ ప్రస్తుతం హైదరాబాద్‌, ఢిల్లీ, ముంబై, పూనే, అహ్మదాబాద్‌ ఇలా మొత్తం పదమూడు నగరాల్లో స్కూటర్‌ అమ్మకాలు జరుగుతున్నాయి. ఇంటి దగ్గర ఛార్జింగ్‌ పాయింట్స్‌ కాకుండా ఈ స్కూటర్లు బయట ఛార్జింగ్‌ చేసుకునేందుకు వీలుగా గ్రిడ్‌ లోకేషన్‌ పేరుతో ఛార్జింగ్‌ పాయింట్లను అథర్‌ ఏర్పాటు చేసింది. 

డబుల్‌ సెంచరీ ‍క్రాస్‌
బెంగళూరులో పది,  చెన్నైలో మూడింటితో గ్రిడ్‌ లోకేషన్‌ ఛార్జింగ్‌ పాయింట్లను అథర్‌ ప్రారంభించింది. ఆ తర్వాత ఒక్కో నగరంలో ఈ పబ్లిక్‌ ఛార్జింగ్‌ పాయింట్లను పెంచుకుంటూ పోయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో పది వరకు గ్రిడ్‌ లోకేషన్‌ పాయింట్లు ఉన్నాయి. తాజాగా దేశ వ్యాప్తంగా డబుల్‌ సెంచరీ మార్కుని అథర్‌ అందుకుంది.

బంపర్‌ ఆఫర్‌
ఇప్పటి వరకు అథర్‌ ఛార్జింగ్‌ స్టేషన్లలో కేవలం ఈ కంపెనీకి చెందిన 450 సిరీస్‌ స్కూటర్ల ఛార్జింగ్‌కే అవకాశం ఉండేంది. అయితే తాజాగా 200ల గ్రిడ్‌ లోకేషన్‌ (పబ్లిక్‌ ఛార్జింగ్‌ పాయింట్‌)ను దాటిన శుభసందర్భంలో అథర్‌ సంస్థ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఈ గ్రిడ్‌ లోకేషన్లలో అథర్‌ సంస్థతో పాటు ఇతర కంపెనీల ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఉచితంగా ఛార్జింగ్‌ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు అథర్‌ ప్రకటించింది. 2021 డిసెంబరు 31 వరకు ఈ ఉచిత సౌకర్యం వినియోగించుకోవచ్చని అథర్‌ ట్వీట్టర్‌లో తెలిపింది.

విస్తరణ బాటలో
గ్రిడ్‌ లోకేషన్‌ ఛార్జింగ్‌ పాయింట్లను కస్టమర్లకు అనువుగా ఉండేలా ఆఫీసులు, పబ్లిక్‌ పార్కులు, కేఫేలు, మాల్స్‌లలో అథర్‌ సంస్థ ఏర్పాటు చేస్తోంది. ప్రతీ నెల 45 కొత్త గ్రిడ్‌లు ఏర్పాటు చేస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా 500 గ్రిడ్‌లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అథర్‌ స్కూటర్లు లభించే నగరాల్లో ప్రతీ నాలుగు కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్‌ పాయింట్‌ ఏర్పాటు చేయబోతున్నట్టు ఆ కంపనీ ప్రతినిధులు తెలిపారు. ఈ ఛార్జింగ్‌ పాయింట్‌లో ఒక నిమిషం పాటు ఛార్జింగ్‌ చేస్తే 1.5 కిలోమీటర్ల దూరం ప్రయాణించే అవకాశం ఉంది. 

చదవండి : ఇకపై ఈజీగా ఎలక్ట్రిక్‌ వెహికల్‌ను సొంతం చేసుకోవచ్చు!

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు