యూపీఐ చార్జీలను రిఫండ్‌ చేయండి

31 Aug, 2020 05:55 IST|Sakshi

బ్యాంకులకు ఐటీ శాఖ సూచన

న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరి 1 నుంచి రూపే కార్డులు, భీమ్‌–యూపీఐ విధానాల్లో చేసిన చెల్లింపులపై విధించిన చార్జీలను కస్టమర్లకు వాపసు చేయాలని బ్యాంకులకు ఆదాయ పన్ను శాఖ సూచించింది. భవిష్యత్‌లోనూ ఈ రెండు విధానాల్లో జరిపే లావాదేవీలపై ఎలాంటి చార్జీలు విధించవద్దని పేర్కొంది. కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఈ మేరకు ఒక సర్క్యులర్‌ జారీ చేసింది. 2020 జనవరి 1 తర్వాత నుంచి నిర్దేశిత ఎలక్ట్రానిక్‌ చెల్లింపులపై ఎండీఆర్‌ (మర్చంట్‌ డిస్కౌంట్‌ రేటు) సహా ఇతరత్రా ఎలాంటి చార్జీలు వర్తించబోవని గతేడాది డిసెంబర్‌లోనే స్పష్టం చేసిన సంగతి ఈ సందర్భంగా ప్రస్తావించింది.

దీనిపై ఆదేశాలు స్పష్టంగా ఉన్నప్పటికీ యూపీఐ లావాదేవీలపై కొన్ని బ్యాంకులు చార్జీలు విధిస్తున్న సంగతి తమ దృష్టికి వచ్చిందని సీబీడీటీ తెలిపింది. ఇది నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుందని, చర్యలు ఎదుర్కొనాల్సి వస్తుందని పేర్కొంది. మరోవైపు, ఈ రిఫండ్‌ల వ్యవహారం బ్యాంకులపై అదనపు భారం మోపుతుందని నాంగియా ఆండర్సెన్‌ పార్ట్‌నర్‌ సందీప్‌ ఝున్‌ఝున్‌వాలా పేర్కొన్నారు. డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించే ఉద్దేశంతో 2019 ఆర్థిక చట్టంలో కేంద్రం ప్రత్యేక నిబంధన చేర్చింది. దీని ప్రకారం రూ. 50 కోట్ల టర్నోవరు దాటిన వ్యాపార సంస్థలు తప్పనిసరిగా ఎలక్ట్రానిక్‌ విధానంలో చెల్లింపులు జరిపేందుకు కస్టమర్లకు వెసులుబాటునివ్వాలి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు