నకిలీ వెబ్‌సైట్‌లో రూ.11 లక్షలు మోసపోయిన బెంగళూరు వాసి - ఎలా జరిగిందంటే?

21 Sep, 2023 13:53 IST|Sakshi

ఆధునిక కాలంలో ఆన్‌లైన్ మోసాలు చాలా పెరిగిపోయాయి. ఆదమరిస్తే డబ్బు పోగొట్టుకోవడం ఖాయం. ఇలాంటి సంఘటలను గతంలో చాలానే వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో సంఘటన కర్ణాటకలో జరిగినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం, బెంగళూరుకు చెందిన 43ఏళ్ల వ్యాపారవేత్త ఫ్రాంచైజీని కొనుగోలు చేయడంలో భాగంగా నకిలీ కేఎఫ్‌సి వెబ్‌సైట్‌లో రూ. 11 లక్షలు కోల్పోయాడు. దీనిపైన ఈస్ట్ CEN పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

నిజానికి అతడు ఫ్రాంచైజీని కొనుగోలు చేసి నగరంలో అవుట్‌లెట్‌ను ఏర్పాటు చేయడానికి కేఎఫ్‌సి సంప్రదింపు వివరాలను తెలుసుకోవడానికి గూగుల్ సెర్చ్ చేసారు. అతడు ఓపెన్ చేసిన కేఎఫ్‌సి వెబ్‌సైట్ అతనికి సంబంధించిన వివరాలు కోరింది. ఇవన్నీ పూర్తి చేసిన తరువాత గుర్తు తెలియని నెంబర్స్ నుంచి కాల్స్ వచ్చాయి. వారు కేఎఫ్‌సి ఉద్యోగులుగా పరిచయం చేసుకున్నారు.

వారు అతనితో మాట్లాడిన తరువాత ఒక ఇమెయిల్ వచ్చింది. దీని ద్వారా కొన్ని ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగించాడు. దాదాపు ఒక నెల రోజులు సంభాషణ తరువాత అతని అభ్యర్థనలను ప్రాసెస్ చేయడానికి డబ్బు అడిగారు. నిజమని నమ్మిన వ్యాపారవేత్త రూ. 11.8 లక్షలు బదిలీ చేసాడు.

వారికి డబ్బు పంపిన తరువాత వారు ఎటువంటి సమాచారం అందించకపోగా.. ఆ కాంటాక్ట్ నంబర్లు స్విచ్ ఆఫ్ అయినట్లు గుర్తించి.. మోసపోయినట్లు తెలుసుకున్నాడు. దీంతో పోలీసులకు పిర్యాదు చేసాడు.

కేఎఫ్‌సి నోటీసు:
కేఎఫ్‌సి తన అధికారిక వెబ్‌సైట్‌లో ఇటువంటి మోసాలు & నకిలీ కేఎఫ్‌సి ఫ్రాంచైజీ వెబ్‌సైట్‌ల పట్ల జాగ్రత్త వహించాలని హెచ్చరికలు జారీ చేసింది. బ్రాండ్ పేరుతో మోసం చేసేవారి సంఖ్య ఎక్కువైపోయింది. ఇప్పటికే చాలా మోసపూరిత వెబ్‌సైట్‌లు ఉన్నాయని తెలిపింది. కావున వినియోగదారులు చాలా జాగ్రత్త వహించాలని స్పష్టం చేసింది.

మరిన్ని వార్తలు