ఫ్యూచర్‌ వీటిదేనా? లాభాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారేనా?

23 Oct, 2021 18:31 IST|Sakshi

ఇప్పుడు ప్రపంచ కుబేరులు ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేర్లు జెఫ్‌ బేజోస్‌, ఎలన్‌మస్క్‌, జుకర్‌బర్గ్‌. ఇదే ప్రశ్నకు పదేళ్ల క్రితం వరకు సమాధానం మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌. వ్యాపారంలో రూల్స్‌ మారుతున్నాయి. సంపద సృష్టికి కేరాఫ్‌ అడ్రస్‌గా ఉన్న మాన్యుఫ్యాక్చరింగ్‌ సెక్టార్‌ స్థానాన్ని టెక్నాలజీ ఆక్రమించింది. దాన్ని నమ్ముకున్న వాళ్లకి కాసులు వర్షం కురిపిస్తోంది. మరీ ఫ్యూచర్‌ టెక్నాలజీ ఏంటీ.. వేటిపైన పెట్టుబడులు సేఫ్‌ అనే చర్చ నడుస్తోంది. 

ఇటీవల స్టాక్‌ మార్కెట్‌లోకి వస్తు‍న్న వారి సంఖ్య పెరుగుతోంది. గణనీయంగా నమోదు అవుతున్న డీమ్యాట్‌ అకౌంట్లే అందుకు నిదర్శనం. చాలా మంది కొద్ది మొత్తంతో స్టాక్‌ మార్కెట్‌లో తమ భవిష్యత్తు ఎలా ఉంటుందో పరిశీలించాలనే ఉత్సాహంతో ఉన్నారు. ఇప్పుడు తక్కువ ధరకు లభించి భవిష్యత్తులో మంచి లాభాలు అందించే స్టాక్స్‌ ఏంటనే దానిపై వారిలో ఆసక్తి నెలకొంది.

5జీ
ఇంటర్నెట్‌ అనేది ఇప్పుడు నిత్యావసరంగా మారిపోయింది. ముఖ్యంగా మొబైల్‌ ఇంటర్నెట్‌ సర్వీసులు అందించే కంపెనీలకు ఫుల్‌ డిమాండ్‌ ఉంది. దీంతో 5జీ సర్వీసులు ఆఫర్‌ చేస్తున్న కంపెనీ స్టాక్‌లు ఫ్యూచర్‌లో హాట్‌కేకుల్లా మారవచ్చని ట్రేడ్‌ పండితుల అభిప్రాయం. మన దగ్గర 5జీ ఇంకా అందుబాటులోకి రాకముందే 6జీ టెక్నాలజీ సైతం తెరపైకి వచ్చేసింది.

ఈవీలదే రాజ్యమా
పెరుగుతున్న పెట్రోలు ధరలు సామాన్యుల పాలిట శాపంగా మారాయి. దీంతో ఎలక్ట్రిక్ వెహికల్స్‌కి మారేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ప్రభుత్వం సైతం ఈవీలకు ప్రోత్సహకాలు అందిస్తోంది. దీంతో భవిషత్తులో ఆటో సెక్టార్లో ఈవీ తయారీ కంపెనీల స్టాక్స్‌ రాకెట్‌లా దూసుకుపోవచ్చనే అంచనాలు ఉన్నాయి.

సంప్రదాయేతర ఇంధనం
కర్బణ ఉద్ఘారాలను తగ్గించాలనే డిమాండ్‌ ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకి పెరుగుతోంది. ఇప్పటికే బొగ్గు వాడకం తగ్గించడంపై దాదాపుగా ఏకాభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో భవిష్యత్తులో కరెంటు ఉత్పత్తి ఎక్కువగా సోలార్‌, హైడ్రోజన్‌ టెక్నాలజీలపై జరగవచ్చని అంచనా. ఇప్పటికే రియలన్స్‌, అదానీ లాంటి బడా కంపెనీలు సంప్రదాయేతర ఇంధన రంగాలపై భారీగా పెట్టుబడులు పెడతామని ప్రకటించాయి. మరిన్ని కంపెనీలు ఈ సెక్టార్‌లోకి రాబోతున్నాయి. 

ఆర్టిఫిషియల్‌ టెక్నాలజీ
ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, నానో టెక్నాలజీ రంగంలో అబ్బురపరిచే ఆవిష్కరణలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ టెక్నాలజీ సామాన్యులకు ఎక్కువగా అందుబాటులోకి రాలేదు. వచ్చాయంటే ఈ టెక్నాలజీ ఆఫర్‌ చేస్తున్న కంపెనీల షేర్లు ఆకాశాన్ని తాకవచ్చనే అభి‍ప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.

నియోబ్యాంక్స్‌
ఫైనాన్షియల్‌ సెక్టార్‌లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆర్థిక అవసరాల కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఫోన్‌ వెరిఫికేషన్‌తోనే అప్పులు అందించే సంస్థలు విరివిగా వెలుస్తున్నాయి. ప్రస్తుతం ఈ కంపెనీలన్నీ స్టార్టప్‌ దశలోనే ఉన్నాయి. అయితే మరో బైజూస్‌, ఫ్లిప్‌కార్ట్‌, జోమాటోలుగా మారేందుకు ఈ ఫిన్‌కార్ప్‌ సంస్థలకు ఎక్కువ సమయం పట్టకపోవచ్చని మార్కెట్‌ విశ్లేషకుల అంచనా 

జాగ్రత్త తప్పనిసరి
ఒకప్పుడు ముడి పదార్థాలను ప్రాసెస్‌ చేసి వస్తువులు తయారు చేసి వాటి అమ్మకాలు జరిపే సంస్థలదే మార్కెట్‌లో పైచేయిగా ఉండేది. కానీ కంప్యూటర్లు ,ఇంటర్నెట్‌, స్మార్ట్‌ఫోన్ల రాకతో పరిస్థితి మారిపోయింది. ఎవరైతే కొత్త టెక్నాలజీని సృష్టిస్తారో, ఎవరైతే దాన్ని సమర్థంగా వాడుతారో వాళ్లపైనే కాసుల వర్షం కురుస్తోంది. దీంతో భవిష్యత్తులో పైన పేర్కొన్న రంగాలకు సంబంధించిన స్టాక్‌లలో పెట్టుబడులు పెడితే గరిష్టంగా లాభాలు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే పెట్టుబడులు పెట్టేముందు కంపెనీ పని తీరు, భవిష్యత్తు ప్రణాళిక, ఆర్థిక పరిస్థితులు తదితర విషయాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని వారు హెచ్చరిస్తున్నారు. 

చదవండి: ఇన్వెస్టర్లకు ఐఆర్‌సీటీసీ షాక్‌

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు