వేదాంత.. నాలుగు ముక్కలు!

18 Nov, 2021 06:17 IST|Sakshi

అల్యూమినియం, ఐరన్,ఆయిల్‌ వ్యాపారాల విభజన

పునర్‌వ్యవస్థీకరణపై సూచనలకు డైరెక్టర్ల కమిటీ

సంస్థ చైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ ప్రకటన

న్యూఢిల్లీ: అనిల్‌ అగర్వాల్‌కు చెందిన వేదాంత లిమిటెడ్‌ తన నిర్వహణలోని వివిధ వ్యాపారాలను వేరు చేసి, వాటిని లిస్ట్‌ చేసే యోచనతో ఉంది. వేదాంత లిమిటెడ్‌తోపాటు.. మరో మూడు వ్యాపారాలు సమాంతరంగా పనిచేసే విధంగా పునర్‌వ్యవస్థీకరణను పరిశీలిస్తున్నట్టు సంస్థ చైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ తెలిపారు. ‘‘మూడు వ్యాపారాలు వృద్ధి చెందేందుకు ఎంతో అవకాశం ఉంది.

ఈ నమూనాలో వ్యాపారాలు విడిగా మరింత వృద్ధి చెందడమే కాకుండా, వాటాదారుల విలువ కూడా ఇతోధికం అవుతుంది’’ అని అగర్వాల్‌ పేర్కొన్నారు. ఈ ప్రణాళికను అమలు చేసినట్టయితే వేదాంత వాటాదారుల వద్ద ప్రస్తుతం ఉన్న ఒక షేరు స్థానంలో నాలుగు షేర్లు ఉంటాయని చెప్పారు. ‘‘ఇది అంతర్జాతీయంగా ఉన్న నమూనానే. దేశీయంగా చూసినా హిందాల్కో, టాటా స్టీల్‌ కనిపిస్తాయి. ఇవి వేర్వేరు వ్యాపారాల్లో ఉన్నాయి. మేము కూడా ఇదే చేయాలనుకుంటున్నాం. దీనిపై తగిన సూచనల కోసం బోర్డు డైరెక్టర్లతో కమిటీని ఏర్పాటు చేశాం.

సమయం చెప్పలేను కానీ, వీలైనంత తొందర్లోనే దీన్ని అమలు చేస్తాం’’అని అగర్వాల్‌ వివరించారు. ఈ విషయమై సాయం కోసం అడ్వైజర్లను కూడా నియమించినట్టు చెప్పారు. వేదాంత సైతం ఈ విషయమై స్టాక్‌ ఎక్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. కార్పొరేట్‌ నిర్మాణం ఎలా ఉండాలి? డీమెర్జర్, స్పిన్‌ ఆఫ్, వ్యూహాత్మక భాగస్వామ్యాలు ఇలా అన్ని రకాల ఆప్షన్లను డైరెక్టర్ల కమిటీ అధ్యయనం చేయ నున్నట్టు తెలిపింది. అల్యూమినియం, ఐరన్‌ అండ్‌ స్టీల్, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ వ్యాపారాలు స్వతంత్ర లిస్టెడ్‌ కంపెనీలుగా ఉండాలన్నది తమ ఆలోచనగా పేర్కొంది. అదానీ గ్రూపు కూడా 2015లో పోర్ట్‌లు, విద్యుత్, మైనింగ్, ట్రాన్స్‌మిషన్‌ వ్యాపారాలను విడదీసి ప్రత్యేకంగా లిస్ట్‌ చేయడం తెలిసిందే.

మరిన్ని వార్తలు